మహా సంక్లిష్టం!

పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు.

Updated : 20 Apr 2024 06:28 IST

కమలానికి నల్లేరుపై నడక కాదు
ఉద్ధవ్‌పై కార్యకర్తల్లో సానుభూతి

పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. కూటముల్లో సంక్లిష్టత రాష్ట్రంలో ఎన్నికలను మరింత సంక్లిష్టం చేసింది.


రెండు కూటముల మధ్యే..

మహారాష్ట్రలోని 48 నియోజకవర్గాల్లో ఐదు విడతల్లో పోలింగ్‌ జరుగుతోంది. రెండు కూటముల మధ్యే  ప్రధానంగా పోరు సాగుతోంది. మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ),   మహాయుతి కూటముల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. పార్టీల చీలికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో రెండు కూటములకూ ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకమే.


అఘాడీలో ఇదీ లెక్క..

  • మొత్తం స్థానాలు: 48
  • శివసేన (ఉద్ధవ్‌) పోటీ చేసే స్థానాలు: 21
  • కాంగ్రెస్‌ చేసేవి: 17
  • ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్‌) చేసేవి: 10
  • శివసేన (ఉద్ధవ్‌) రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో పోటీ చేస్తోంది. కొంకణ్‌, పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర, విదర్భ రీజియన్లలో బరిలోకి దిగుతోంది.
  • చక్కెర పరిశ్రమలున్న పశ్చిమ మహారాష్ట్రపై ఎన్సీపీ(శరత్‌చంద్ర) దృష్టి సారించింది.
  • కాంగ్రెస్‌ విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడా ప్రాంతాల్లో బరిలోకి దిగుతోంది. కొంకణ్‌తోపాటు ముంబయిలోని సీట్లను భాగస్వాములకు వదిలేసింది.

మహాయుతిలో..

భాజపా, శివసేన (శిందే), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. 9 సీట్లపై పీటముడి కొనసాగుతోంది. కూటమి మధ్య రత్నగిరి-సింధుదుర్గ్‌, సతారా, ఔరంగాబాద్‌, నాసిక్‌, ఠాణే, పాల్ఘర్‌, దక్షిణ ముంబయి,    వాయవ్య ముంబయి, ఉత్తర మధ్య ముంబయి నియోజకవర్గాల్లో ఇంకా పార్టీల మధ్య ఒప్పందం కుదరలేదు. ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్‌, అజిత్‌ పవార్‌ల మధ్య చర్చలు జరిగిన ఫలితం కనిపించలేదు. ఇప్పటివరకే భాజపా 24, శివసేన 10, ఎన్సీపీ 4 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి. రాష్ట్రీయ సమాజ్‌ పార్టీకి ఒక సీటును ఎన్డీయే కూటమి కేటాయించింది. 

  • నాసిక్‌ సీటుపై ఎన్డీయేలోని రెండు పార్టీలు పట్టుబడుతున్నాయి. శివసేన సిట్టింగ్‌ ఎంపీ హేమంత్‌ గాడ్సే ఈ సీటుపై ఒత్తిడి తెస్తున్నారు. ఎన్సీపీకి చెందిన ఛగన్‌ భుజ్‌బల్‌ ఈ సీటును ఆశిస్తున్నారు. ఆయన తమ పార్టీ గుర్తుపై పోటీ చేయాలని భాజపా కోరుకుంటోంది. కానీ ఆయన తిరస్కరించారు.
  • సతారాలోనూ ఎన్డీయేలోని మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

    ప్రభావం చూపే అంశాలు

  • విదర్భ ప్రాంతంలో వ్యవసాయరంగంలో తీవ్ర సమస్యలున్నాయి. ఈ ప్రాంతంలో అకాల వర్షంవల్ల 38,000 హెక్టార్లలో పంటలను రైతులు నష్టపోయారు. ఇక్కడ ఈ నెల 19, 26 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది.
  • విదర్భ డివిజన్‌లో 2020 నుంచి 2022 మధ్యలో 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఒక్క అమరావతి రీజియన్‌లోనే 3,452 మంది బలవన్మరణం పాలయ్యారు.
  • గత ఎన్నికల్లో విదర్భలోని 10 నియోజకవర్గాల్లో ఐదు చోట్ల భాజపా గెలిచింది. ఆ పార్టీ అప్పటి భాగస్వామి శివసేన 3 సీట్లు గెలుచుకుంది.
  • మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడంపై ఓబీసీల్లో వ్యతిరేకత ఉంది.
  • అయోధ్యలో రామ మందిర నిర్మాణ అంశం విదర్భ ప్రాంతంలో పెద్దగా ప్రభావం చూపడం లేదు. నాగ్‌పుర్‌-అయోధ్య ఆస్థా ఎక్స్‌ప్రెస్‌లో టికెట్లు నిండకపోవడమే ఇందుకు నిదర్శనమని స్థానికుడొకరు చెప్పారు.
  • నిరుద్యోగ అంశం రాష్ట్రంలో ప్రభావం చూసే అవకాశముంది.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 11.5శాతం మంది ముస్లింలు ఉన్నారు. వీరంతా ఎటు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరం. ఎంఐఎం గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లను భారీగానే చీల్చింది. ఈసారి మళ్లీ పోటీ చేస్తామని ఆ పార్టీ అధినేత ఒవైసీ చెబుతున్నారు.
  • మళ్లీ భాజపా కేంద్రంలో అధికారంలోకి వస్తే అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తుందనే ఆందోళన రాష్ట్రంలో అధికంగా ఉన్న దళితుల్లో నెలకొంది. దానివల్ల రిజర్వేషన్లను కోల్పోతామని వారు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ అంబేడ్కర్‌ వచ్చినా రాజ్యాంగాన్ని మార్చలేరని ప్రధాని మోదీ చెబుతున్నా వారిలో నమ్మకం కలగడం లేదు.

2019లో మిత్రులే ఇప్పుడు బద్ధ శత్రువులు

గత లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, అవిభాజ్య శివసేన కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్‌ అవిభాజ్య ఎన్సీపీ కలిసి బరిలోకి దిగాయి. ప్రస్తుత ఎన్నికల్లో భాజపా, శివసేన (ఉద్ధవ్‌) బద్ధ శత్రువులుగా మారాయి. గత ఎన్నికల్లో శత్రువులుగా బరిలోకి దిగిన శివసేన, కాంగ్రెస్‌-ఎన్సీపీ కూటమి ఈసారి మిత్రులుగా మారాయి. శరద్‌ పవార్‌ కుటుంబం రెండుగా చీలిపోయింది. ఆయన కుమార్తె సుప్రియా సూలేపై బారామతిలో కోడలు వరుసయ్యే సునేత్రా పవార్‌ (అజిత్‌ వర్గం నుంచి) పోటీ చేస్తున్నారు.


 ప్రస్తుత పరిస్థితి..

  • ‘భాజపాపై నాకు నమ్మకం లేదు. అదే సమయంలో కాంగ్రెస్‌లో సరైన నాయకుడు లేరు’ అని నాగ్‌పుర్‌లో కిరాణా దుకాణం నడిపే వ్యక్తి చెబుతున్నారు.
  • విదర్భ నుంచి 10 మంది ఎంపీలను పంపుతున్నా ఏ ఒక్క అభ్యర్థీ రైతుల ఆత్మహత్యలపై మాట్లాడటం లేదు.
  • విదర్భలోని అతి పెద్ద నగరమైన నాగ్‌పుర్‌లో కేంద్ర మంత్రి గడ్కరీ పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు నల్లేరుపై నడకే.
  • ముఖ్యమంత్రి శిందే సొంత ప్రాంతం ఠాణేలోని శివసేన కార్యకర్తలు సంతృప్తిగా లేరు. వారు భాజపాపై వ్యతిరేకతతో ఉన్నారు. ఠాణే, కల్యాణ్‌లలో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోవాలని భాజపా సూచించడం వారికి రుచించడం లేదు. ఇప్పటికే కల్యాణ్‌ నుంచి శిందే కుమారుడు శ్రీకాంత్‌ శిందే ఎంపీగా ఉన్నారు.
  • మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే భాజపాకు మద్దతు ప్రకటించారు. 

పార్టీల ఆశలు

  • రాష్ట్రంలో మోదీ ప్రభావంపైనే భాజపా ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో 41 సీట్లను  గెలుచుకున్న ఎన్డీయే ఈసారి 45 సీట్లను లక్ష్యంగా పెట్టుకుంది.
  • కాంగ్రెస్‌ సానుభూతి ఓట్లపై ఆధారపడుతోంది.
  • సర్వేల్లో ఉద్ధవ్‌పై ప్రజల్లో సానుభూతి ఉందని తేలడం శివసేనకు (ఉద్ధవ్‌) ఊరట కలిగించే అంశం. ఇప్పటికీ క్షేత్ర స్థాయి కార్యకర్తల్లో ఆయనపైనే అభిమానం కనిపిస్తోంది.

 ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని