పోస్టల్‌ బ్యాలెట్‌ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు.

Published : 20 Apr 2024 05:37 IST

సీఈవోకు వర్ల రామయ్య లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తు కోసం ఇచ్చే ఫాం-12 అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. ‘‘పోస్టల్‌ బ్యాలెట్ల వినియోగంపై నేటికీ ఎటువంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లకు సంబంధించి జిల్లాకో నోడల్‌ అధికారిని నియమించి.. ఫాం-12 దరఖాస్తులు స్వీకరించాలని ఈసీ స్పష్టం చేసింది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ఈసీ నిబంధనల్ని అనుసరించి ఫాం-12 దరఖాస్తులు అందించేలా చర్యలు తీసుకోండి. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి’’ అని లేఖలో వర్ల రామయ్య కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని