జగన్‌పై రాయి దాడి కేసులో సెక్షన్‌ 307 వర్తించదు

సీఎం జగన్‌పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్‌ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు.

Published : 20 Apr 2024 05:38 IST

వైకాపాకు కొమ్ముకాస్తున్న ఒంగోలు, చిత్తూరు సీఐలపై చర్యలు తీసుకోండి
సీఈవోకు తెదేపా నేతల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్‌ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేయించి నిజానిజాలను వెలుగులోకి తేవాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనాకు శుక్రవారం తెదేపా నేతలు వర్ల రామయ్య, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, సురేష్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పి.కృష్ణయ్య ఫిర్యాదు చేశారు. వైకాపా తొత్తుల్లా మారిన ఒంగోలు సీఐ భక్తవత్సలరెడ్డి, అర్బన్‌ సీఐ ఎం.లక్ష్మణ్‌, చిత్తూరు సీఐ గంగిరెడ్డిపై... పొన్నూరు తెదేపా అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర పరువుప్రతిష్ఠలకు భంగం కలిగించేలా పెయిడ్‌ కథనాలు ప్రచురిస్తున్న సాక్షి పత్రికపై చర్యలు తీసుకోవాలని సీఈవోను  కోరినట్టు వర్ల రామయ్య తెలిపారు. ‘తమిళనాడులో ఏపీకి చెందిన సుమారు 30 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ఈ ఏడాది కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు అత్యధికంగా ఉన్నారు. వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా మే 13న తమిళనాడులో నిర్వహించే పరీక్షల్ని వాయిదా వేయాలి. మన రాష్ట్రంలోనూ ఎలాంటి పరీక్షలూ నిర్వహించకుండా చూడాలి. నగరి వైకాపా అభ్యర్థి రోజా తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన రైల్వే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి’ అని సీఈవోను కోరినట్లు వర్ల రామయ్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని