బాబ్బాబు.. వైకాపా వీడొద్దయ్యా!

మేమంతా సిద్ధం అంటూ జగన్‌ బస్సు ఎక్కి భీమిలి వస్తుంటే.. ‘మేమంతా సిద్ధమే తెదేపాలోకి వెళ్లేందుకు’ అంటూ ఆనందపురం మండలం కుసులువాడ గ్రామస్థులు మూకుమ్మడిగా సైకిలెక్కారు.

Published : 22 Apr 2024 05:08 IST

భీమిలి పర్యటనలో.. జగన్‌కు వలసపోటు
కుసులువాడ సర్పంచి సహా ఊరంతా తెదేపాలోకి
వెళ్లొద్దంటూ.. బతిమాలిన ఎమ్మెల్యే అవంతి సోదరుడు
అయినా ఆగని వలసలు

విశాఖపట్నం (ఆనందపురం), న్యూస్‌టుడే: మేమంతా సిద్ధం అంటూ జగన్‌ బస్సు ఎక్కి భీమిలి వస్తుంటే.. ‘మేమంతా సిద్ధమే తెదేపాలోకి వెళ్లేందుకు’ అంటూ ఆనందపురం మండలం కుసులువాడ గ్రామస్థులు మూకుమ్మడిగా సైకిలెక్కారు. బాబ్బాబు, ఈ ఒక్కరోజుకు ఆగండయ్యా అంటూ వైకాపా ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు, ఆయన సోదరుడు బతిమాలినా భంగపాటు తప్పలేదు. తెదేపాలో చేరిన వారు ఒకరిద్దరు కాదు.. పంచాయతీ సర్పంచి మహంతి వెంకటలక్ష్మి, పదిమంది వార్డుసభ్యులు సహా ఒకేసారి దాదాపు 500 మంది  ఆదివారం భీమిలి తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో కండువాలు వేసుకున్నారు. జగన్‌ నియోజకవర్గంలో ఉన్న సమయంలోనే వైకాపా నుంచి తెదేపాలోకి ఊరు ఊరంతా కదలడం చర్చనీయాంశమైంది.

ఎమ్మెల్యే సోదరుడు.. బతిమాలినా

భీమిలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం పర్యటించనున్నారు. కనీసం జగన్‌ పర్యటన జరిగే వరకైనా ఆగమంటూ.. వైకాపా ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు వారిని తెదేపాలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అవంతి సోదరుడు మహేశ్‌ పట్టువిడవకుండా గంటా ఇంటి వరకు వారిని వెంబడించారు. పార్టీ మారొద్దంటూ వారి చేతులు పట్టుకుని బతిమాలుతూనే ఉన్నారు.. అయినా ఎవరూ వినిపించుకోలేదు. అభివృద్ధిని ఆకాంక్షించి తెదేపాలో చేరుతున్నట్లు సర్పంచి వెంకటలక్ష్మితోపాటు ఉపసర్పంచి ఆల్తిరామారావు, వార్డు సభ్యులు తామురోతు లక్ష్మి, కోరాడ పైడిరాజు, చింతాడ వెంకట సూర్యనారాయణ, రవ్వ లక్ష్మి, పిల్లా పార్వతి, ఈగల వెంకటరమణ, రేగాని రాము, రేగాని అప్పలనాయుడు, వరపుల గౌరీతో పాటు పంచాయతీలోని వైకాపా సీనియర్‌ నాయకులు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని