సొమ్ములిచ్చి.. జనాన్ని తెచ్చి!.. జగన్‌ బస్సు యాత్రకు నేతల ఆపసోపాలు

విశాఖలో ఆదివారం సీఎం జగన్‌ చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమంది. డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు పంచి మరీ కొన్ని కూడళ్ల వద్ద జనాలను నింపాల్సి వచ్చింది.

Updated : 22 Apr 2024 07:03 IST

ఒక్కొక్కరికి రూ. 300 ఇచ్చిన అభ్యర్థులు
అయినా స్పందన అంతంత మాత్రమే!
ట్రాఫిక్‌ ఆంక్షలతో ఎండలో జనం ఉక్కిరిబిక్కిరి

ఈనాడు-విశాఖపట్నం: విశాఖలో ఆదివారం సీఎం జగన్‌ చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమంది. డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు పంచి మరీ కొన్ని కూడళ్ల వద్ద జనాలను నింపాల్సి వచ్చింది. స్థానికులు ఆసక్తి చూపకపోవడంతో విజయనగరం జిల్లా కొత్తవలస వంటి సరిహద్దు గ్రామాల నుంచి సైతం జనసమీకరణ చేశారు. నాయకులు ఎన్ని ఆపసోపాలు పడినా, ఎండ వేడిమికి తట్టుకోలేక జనం వచ్చినవాళ్లు వచ్చినట్లు జారుకున్నారు. వైకాపా అభ్యర్థులు యాత్ర కోసం ఒక్కొక్కరికి రూ. 300 చొప్పున చేతిలో పెట్టినా స్పందన తక్కువే కనిపించింది. నాయకుల అనుచరులు మాత్రమే వందలమంది బస్సును అనుసరిస్తూ వచ్చారు. ఎక్కడా అభ్యర్థుల పరిచయాలు కానీ, సభ కానీ లేకుండా రోడ్‌షోతోనే సరిపెట్టారు. పినగాడి జంక్షన్‌ వద్ద జగన్‌ బస్సు ఫుట్‌ బోర్డు వరకు వచ్చి ఓ వృద్ధురాలిని పలకరించారు. తర్వాత బస్సు టాప్‌ ఎక్కి అభివాదం చేసినా, ఆపై ఎండ వేడిమి కారణంగా లోపలే కూర్చున్నారు. గోపాలపట్నం పెట్రోలు బంకు సమీపంలో ఏర్పాటు చేసిన బస వద్ద మధ్యాహ్న భోజనానికి విరామం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు వాతావరణం చల్లబడడంతో గోపాలపట్నం నుంచి బస్సుపై నిలబడి ఎండాడ వరకు రోడ్‌షో నిర్వహించారు. పెందుర్తి, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం, తూర్పు, భీమిలి పరిధిలో ఆయా నియోజకవర్గ అభ్యర్థులను పక్కన పెట్టుకుని అభివాదాలు చేశారు.

మూడు ఫార్మాట్లలో డబ్బులు

బస్సు యాత్ర వెంట పాల్గొనడానికి బిర్యానీ ప్యాకెట్లు ఇస్తామన్నా తమకు అందలేదని పెందుర్తి పరిధిలో కొందరు అసహనం వ్యక్తం చేశారు. ‘మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంచారు. ఇచ్చిన రూ.300 ఇక్కడే ఖర్చైపోయాయి’ అంటూ అక్కయ్యపాలెంలో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పెందుర్తి పరిధిలో కొందరు వాలంటీర్లతో రూ. 300 చొప్పున పంపిణీ చేయించి, మహిళలను కూడళ్ల వద్దకు చేర్చే బాధ్యతలు అప్పగించారు. విశాఖ ఉత్తరంలో యువత ర్యాలీగా బస్సును అనుసరించడానికి పెట్రోలు కూపన్లు ఇచ్చారు. తూర్పులో కూపన్లు ఇచ్చి, వాటిని చూపిస్తే డబ్బులు ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో బస్సు వెళ్లే వరకు ఉన్నవారికి మాత్రమే డబ్బులిచ్చారు. ఈ తతంగం అంతా పోలీసుల కళ్లముందే జరుగుతున్నా ప్రేక్షకపాత్ర వహించారు.

వైర్లు కట్‌ చేసి.. దుకాణాలు మూయించేసి

జగన్‌ పర్యటన నేపథ్యంలో ఆయా మార్గాల్లో చాలాచోట్ల నీడనిచ్చే పచ్చని చెట్ల కొమ్మలను కొట్టేశారు. కొన్నిప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు మండిపడ్డారు. కేబుల్‌ వైర్లు తొలగించడం వల్ల ప్రసారాలు నిలిచిపోయాయి. కంచరపాలెం మెట్టు నుంచి తాటిచెట్లపాలెం వైపు వచ్చే మార్గంలో పలుచోట్ల అధికారులు హడావుడిగా అప్పటికప్పుడు వీధి దీపాలు ఏర్పాటు చేశారు. జగన్‌ పర్యటించే మార్గం పలుచోట్ల కర్ఫ్యూను తలపించింది. దారి పొడవునా దుకాణాలను మూయించేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని