ఏ ముఖం పెట్టుకొని ఉత్తరాంధ్రకు వస్తున్నారు?

‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన వేల ఎకరాలను అమ్మేయాలని చెప్పి, దాన్ని అంపశయ్య మీదకు చేర్చిన సీఎం జగన్‌.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని విశాఖకు వస్తున్నారు? నగరాన్ని గంజాయికి, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చారు.

Published : 22 Apr 2024 05:10 IST

విశాఖ ఉక్కును అంపశయ్య మీదకు చేర్చిన జగన్‌
తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరాం

ఈనాడు, అమరావతి: ‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన వేల ఎకరాలను అమ్మేయాలని చెప్పి, దాన్ని అంపశయ్య మీదకు చేర్చిన సీఎం జగన్‌.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని విశాఖకు వస్తున్నారు? నగరాన్ని గంజాయికి, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చారు. రాజధాని పేరుతో రుషికొండకు గుండుకొట్టి ప్యాలెస్‌ కట్టి ప్రజల్ని మోసగించారు. ఆయనకు విశాఖలో అడుగుపెట్టే అర్హత లేదు. సిద్ధం సభకు వస్తున్న జగన్‌ను ఉత్తరాంధ్ర ప్రజలే నిలదీయాలి’ అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం పిలుపునిచ్చారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఉత్తరాంధ్రకు జగన్‌రెడ్డి చేసిన వినాశనానికి ప్రత్యక్ష రూపం గంగవరం పోర్టు. లాభాల్లో నడుస్తున్న పోర్టును అదానీకి కట్టబెట్టి కమీషన్లు దండుకున్నారు. నేడు పోర్టు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయ’ని మండిపడ్డారు. ‘గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను అమ్మాక.. విశాఖ స్టీల్‌కు కోకింగ్‌ కోల్‌ దిగుమతి చేసుకునే ప్రత్యేక బెర్త్‌ లేకుండాపోయింది. 100 ఎకరాల స్టాక్‌యార్డునూ మాయం చేశారు. గతంలో హ్యాండ్లింగ్‌ ఛార్జి టన్నుకు రూ.270 ఉంటే, పోర్టును అమ్మాక అది రూ.350 అయింది. స్టీల్‌ప్లాంట్‌కు బొగ్గు సరఫరా నిలిచి, 90శాతానికి పైగా ఉత్పత్తి పడిపోయింది. గతంలో రోజుకు 14-15 వేల టన్నుల స్టీల్‌ ఉత్పత్తి అవుతుంటే.. జగన్‌ తిరోగమన చర్యల వల్ల 4 వేల టన్నులకు పడిపోయింది. మూడు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు నడవాల్సి ఉండగా, ఒకటే నడుస్తోంది. లక్ష టన్నుల కోకింగ్‌ కోల్‌ నిల్వలుండే పరిశ్రమలో ఇప్పుడు 4 టన్నులు మాత్రమే ఉన్నాయి. ప్లాంట్‌ ఎప్పుడైనా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. వీటన్నింటికీ కారణం జగన్‌, మంత్రి అమర్‌నాథ్‌లే’ అని పట్టాభిరాం ఆరోపించారు. 20వ తేదీ వచ్చినా ఫ్యాక్టరీ ఉద్యోగుల్లో సగం మందికి జీతాలు రాలేదని, వేతనాల పెంపు, ఆరోగ్య బీమా వంటి న్యాయమైన డిమాండ్లనూ నెరవేర్చలేదని ఆరోపించారు. పైగా కరెంటు బిల్లుల కోసం స్టీల్‌ ప్లాంటు పీకలపై కూర్చొని ఫీజులు పీకేస్తామంటూ బెదిరిస్తున్నారని పట్టాభి ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని