రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి

¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్‌ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు.

Published : 23 Apr 2024 06:29 IST

రూ.40 వేల కోట్ల ఇసుక దోపిడీలో వెంకటరెడ్డి సహకారం
ఇండోసోల్‌, అరబిందోకు లక్షల ఎకరాలు కట్టబెట్టిన రమణారెడ్డి
డిప్యుటేషన్‌పై వచ్చిన వీరంతా జగన్‌కు వీరవిధేయులు
వెంటనే వీరిపై ఈసీ చర్యలు తీసుకోవాలి
తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌  

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్‌ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. ఈ అయిదేళ్లలో కేంద్రం నుంచి 18 మంది అధికారులు డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వస్తే..వారిలో పది మంది సీఎం జగన్‌ సామాజిక వర్గానికి చెందిన వారేనని స్పష్టం చేశారు. వీరందరికి మైన్స్‌, బెవరేజస్‌, ఫైనాన్స్‌, రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ లాంటి కీలక విభాగాలను కట్టబెట్టారని.. అందుకే వీరంతా జగన్‌కు వీరవిధేయత చూపుతున్నారని విమర్శించారు. నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్న వీరి వల్ల ఎన్నికల పారదర్శకతే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఏపీ బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిని బదిలీ చేసినట్లే వీరిపైనా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తితిదే ఈవో ధర్మారెడ్డి...డిఫెన్స్‌ సర్వీసు ఉద్యోగి. ఇప్పటికి రెండు సార్లు ఆయన డిప్యుటేషన్ను పొడిగించారు.  మూడోసారి పొడిగింపు కోరుతూ కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం జగన్‌ లేఖ కూడా రాశారు. దీన్ని బట్టే ఈయన స్థాయి, లాబీయింగ్‌ అర్థం చేసుకోవచ్చు. 2013 సెప్టెంబర్‌లో కరుణాకర్‌రెడ్డి తితిదే బోర్డు ఛైర్మన్‌ కాగానే..ఇద్దరూ కుమ్మక్కై బడ్జెట్‌తో సంబంధం లేకుండా సుమారు రూ.1,233 కోట్ల విలువైన కాంట్రాక్టులను అస్మదీయులకు దోచిపెట్టారు’ అని విజయ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కక్ష సాధింపుల్లోనూ భాగస్వాములు

‘ఏపీ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఎండీగా నిన్నటి దాకా పనిచేసిన రమణారెడ్డి..జగన్‌ కక్ష సాధింపు చర్యల్లో భాగస్వామి. తెదేపా ప్రభుత్వం చేసుకొన్న సౌర విద్యుత్తు ఒప్పందాల రద్దుకు ఆయన సహకరించారు. అరబిందో, ఇండోసోల్‌ లాంటి సంస్థలకు లక్షల ఎకరాల భూముల్ని దోచిపెట్టారు. ఇండియన్‌ కోస్ట్‌ గార్డు సర్వీసు నుంచి వచ్చిన వెంకటరెడ్డి... ఏపీఎండీసీ ఎండీగా జగన్‌ రూ.40 వేల కోట్ల ఇసుక దోపిడీకి సంపూర్ణ సహకారం అందించారు. ఇటీవలే ఏపీఎండీసీ నుంచి బాండ్లు జారీ చేయించి..సుమారు రూ.7 వేల కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేయించారు. రైల్వే అకౌంట్‌ సర్వీస్‌ నుంచి వచ్చిన మధుసూధన్‌రెడ్డి..ఏపీ ఫైబర్‌నెట్‌ను నిర్వీర్యం చేశారు. జగన్‌కు రాజకీయ లబ్ధి చేకూర్చడానికి ‘వ్యూహం’ లాంటి సినిమాలను ఫైబర్‌నెట్‌లో ప్రసారం చేయిస్తున్నారు’ అని విజయ్‌కుమార్‌ మండిపడ్డారు.

వ్యాపార సంస్థలకు వేధింపులు

‘చిలకల రాజేశ్వర్‌రెడ్డిని ఏపీ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ విభాగానికి స్పెషల్‌ కమిషనర్‌గా నియమించి..తెదేపా నాయకుల వ్యాపార సంస్థలపై దాడులు చేయించారు. తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డిని ఐఅండ్‌పీఆర్‌ కమిషనర్‌ను చేసి సాక్షి పత్రికకు రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ ప్రకటనలు ఇప్పించారు. ఏపీ విద్యా మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీ దివాన్‌రెడ్డి ‘నాడు-నేడు’ పనులను వైకాపా వాళ్లకు కట్టబెట్టి...రూ.వందల కోట్ల దోపిడీలో కీలకంగా వ్యవహరించారు’ అని విజయ్‌కుమార్‌ విరుచుకుపడ్డారు. ఐఏఎస్‌లు నిర్వర్తించాల్సిన పోస్టులను.. డిఫెన్స్‌, కోస్టుగార్డు, రైల్వే అకౌంట్‌ సర్వీసుల నుంచి వచ్చిన వారికి కట్టబెట్టి..చట్టవిరుద్ధమైన పనులను చేయిస్తున్నారని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని