సంక్షిప్త వార్తలు (8)

ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్‌ మాట్లాడుతూ

Updated : 23 Apr 2024 07:09 IST

ఎన్డీయే అభ్యర్థులకే ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ మద్దతు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్‌ మాట్లాడుతూ పదవీవిరమణ పొందినవారిని వైకాపా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. సంఘ ప్రధాన కార్యదర్శి బి.పెద్దన్న గౌడ్‌ మాట్లాడుతూ క్వాంటమ్‌ ఆఫ్‌ పింఛన్‌ను తగ్గించడమే కాకుండా మెడికల్‌ బిల్లులు రెండేళ్లయినా విడుదల చేయలేదన్నారు.


కేంద్ర ఫిర్యాదుల విభాగం ప్రారంభం

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం, ఓటర్లను ప్రలోభపెట్టే ఉచిత వస్తువుల పంపిణీ, శాంతిభద్రతల పరిరక్షణ, ఇతర ఎన్నికల నేరాలను అరికట్టేందుకు రాష్ట్ర స్థాయిలో విజయవాడలో ‘కేంద్ర ఫిర్యాదుల విభాగాన్ని’ ప్రారంభించినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌(సీపీ) కాంతిరాణా తెలిపారు. ఎన్నికల ప్రలోభాలపై ఎలాంటి సమాచారమైనా టోల్‌ ఫ్రీ నంబరు 1800 425 5049కు చెప్పాలని సీపీ ఓ ప్రకటనలో కోరారు.


తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా శ్రీధర్‌బాబు

ఈనాడు, అమరావతి: తెదేపా సాధికార సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కర్నూలు నియోజకవర్గానికి చెందిన సముద్రాల శ్రీధర్‌బాబును నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం ఆదేశాలు జారీచేశారు. 12 లోక్‌సభ స్థానాల పరిధిలో తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి పార్లమెంట్‌ కన్వీనర్లను నియమించారు. రాష్ట్రంలో 15 లోక్‌సభ స్థానాల పరిధిలో తెదేపా ప్రొఫెషనల్స్‌ వింగ్‌ పార్లమెంటు కమిటీలను నియమిస్తూ అచ్చెనాయుడు ఆదేశాలు జారీచేశారు.


ప్రమాణపత్రం అందజేసిన నారా లోకేశ్‌

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి నియోజకర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ సోమవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని కార్యాలయంలో ఆర్వో రాజకుమారికి తన ప్రమాణ పత్రాన్ని అందజేశారు. ఆయనతో పాటు నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త నందం అబద్ధయ్య ఉన్నారు. లోకేశ్‌ ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


వైకాపాకు కురుబ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సూర్యప్రకాశ్‌ గుడ్‌బై

బత్తలపల్లి, న్యూస్‌టుడే: ‘శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బీసీల ద్రోహి.. వారిని ఆర్థికంగా అణగదొక్కారు’ అని రాష్ట్ర కురుబ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోటి సూర్యప్రకాశ్‌బాబు చెప్పారు. తాను వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్‌ నమ్మించి మోసం చేశారన్నారు. కురుబ కార్పొరేషన్‌కు నిధులివ్వలేదని, కురుబలకు అన్యాయం చేసిన పార్టీ వైకాపా అని విమర్శించారు.  

నేడు భాజపాలో చేరిక: మంగళవారం ధర్మవరంలో భాజపా అభ్యర్థి సత్యకుమార్‌ నామినేషన్‌కు హాజరుకానున్న కేంద్ర మంత్రి వి.కె.సింగ్‌ సమక్షంలో భాజపాలో చేరనున్నట్లు సూర్యప్రకాశ్‌బాబు ప్రకటించారు.


ఎన్నారైల్ని ఉగ్రవాదుల్లా చిత్రీకరిస్తున్న వైకాపా

తెదేపా నేత కోమటి జయరాం ధ్వజం  

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపాకు మద్దతిస్తున్న ఎన్నారైల్ని వైకాపా నేతలు ఉగ్రవాదుల్లా చిత్రీకరిస్తున్నారని తెదేపా ఎన్నారై విభాగం సమన్వయకర్త కోమటి జయరాం ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారానికి తెదేపా కృషి చేసిందని గుర్తు చేశారు. తెలుగు ప్రజల అభ్యున్నతికి దోహదపడాలనే ఉద్దేశంతో ఎన్నారైలంతా ఈ ఎన్నికల్లో పని చేయాలని తాను చెప్పిన మాటల్ని వైకాపా నాయకులు వక్రీకరిస్తున్నారని సోమవారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్నారంటే.. అందుకు చంద్రబాబు తీసుకొచ్చిన సంస్కరణలే కారణం. అలాంటి వ్యక్తిని ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. రాష్ట్ర హితం కోసం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే ప్రవాసాంధ్రుల లక్ష్యం’ అని జయరాం స్పష్టం చేశారు.


16 గిరిజన సంక్షేమ పథకాల్ని రద్దు చేసిన జగన్‌

గిరిజన సమ్మేళనంలో తెదేపా నేతల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా హయాంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా అమలు చేసిన 16 సంక్షేమ పథకాల్ని.. సీఎం జగన్‌ రద్దు చేశారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. నా ఎస్టీలు అంటూనే జగన్‌ వారిని వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ట్రైబల్‌ ఫెడరేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు భైరి ఓంకార్‌ నేతృత్వంలో గిరిజన సమ్మేళనం నిర్వహించారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.. దళిత, గిరిజనులకు రుణాలివ్వకుండా బ్యాంకులు ఇబ్బందులు పెడుతున్నాయని ఆరోపించారు. ఆయా వర్గాల అభివృద్ధి, సంక్షేమం తమ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ‘‘ఎన్టీఆర్‌ మొదలు చంద్రబాబు వరకు ఎస్సీ, ఎస్టీల్ని ఆదుకున్నారు. విదేశీవిద్య పథకం ద్వారా ఉన్నత చదువులకు అవకాశం కల్పించారు. కానీ అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఎంత మందిని విదేశాలకు పంపింది’’ అని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వ అరాచకాల్ని ప్రశ్నించిన ఎస్టీలపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారని తెదేపా ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ధారునాయక్‌ ఆరోపించారు.


తెదేపా ప్రొఫెషనల్స్‌ వింగ్‌ కమిటీలోకి కొత్తగా 20 మంది

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా ప్రొఫెషనల్స్‌ వింగ్‌ రాష్ట్ర కమిటీలోకి కొత్తగా 20 మందిని తీసుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. నలుగురు ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఆరుగురు కార్యనిర్వాహక కార్యదర్శులు, ఏడుగురు కార్యదర్శుల్ని అదనంగా నియమించినట్లు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని