బ్యాలెట్‌ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్‌ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.

Published : 24 Apr 2024 05:42 IST

సిద్ధం చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం
సీళ్లు, ట్యాగ్‌లను మే 15లోగా ముద్రించాలని పంచాయతీరాజ్‌ శాఖకు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్‌ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది. బ్యాలెట్‌ బాక్సులకు సంబంధించిన సీళ్లు, చిరునామా ట్యాగ్‌లను వచ్చే నెల 15లోగా ముద్రించాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ను ఎస్‌ఈసీ మంగళవారం ఆదేశించింది. రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరి ఒకటో తేదీతో ముగిసింది. మండల, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ, జడ్పీటీసీ) సభ్యుల పదవీ కాలం జులై 3న ముగియనుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎస్‌ఈసీ కసరత్తు చేపట్టింది. గ్రామ పంచాయతీల ఎన్నికలు వాయిదా పడడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ల నుంచి స్థానాల సంఖ్య, రిజర్వేషన్లకు సంబంధించిన సమాచారం తీసుకుంది. తాజాగా బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో మొదటి నుంచీ స్థానిక ఎన్నికలు బ్యాలెట్‌ బాక్సులతోనే నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా అదేరీతిలో జరిపించాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది. ఈ  బ్యాలెట్‌ బాక్సులకు కాగితపు సీళ్లు, చిరునామా ట్యాగ్‌లను అతికించాల్సి ఉంది. దీనికోసం వాటి ముద్రణను చేపట్టాలని నిర్ణయించింది. పేపర్‌ సీళ్లతో పాటు పోలింగ్‌ కేంద్రం, గ్రామం, మండలం, జిల్లాలను సూచించే ట్యాగ్‌లను ఆంగ్ల, తెలుగు భాషల్లో ముద్రించాలని నిర్ణయించింది. వీటిని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ ప్రింటింగ్‌ ప్రెస్‌లో ముద్రించాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు సూచించింది. పేపర్‌ సీల్‌, చిరునామా ట్యాగ్‌ల నమూనాను తెలుపుతూ పచ్చరంగులో వాటిని దళసరి కాగితంతో ముద్రించాలని సూచించింది. ఎన్నికలు జరిగే పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ స్థానాల్లో పోలింగ్‌ కేంద్రాల్లోని నాలుగేసి బ్యాలెట్‌ బాక్స్‌లకు అవసరమయ్యేలా పేపర్‌ సీళ్లతో పాటు అదనంగా మరో 20 శాతం (రిజర్వ్‌), అదే సంఖ్యలో చిరునామా ట్యాగ్‌లను ముద్రించాలని సూచించింది.

తేదీలపై ప్రభుత్వానిదే నిర్ణయం!

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ జూన్‌ నాలుగో తేదీతో ముగుస్తుంది. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే వీలుంది. తేదీలపై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం కానుంది. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావాల్సి ఉంది. బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు నేతృత్వంలో ఇప్పటికే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కసరత్తు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే జూన్‌లో ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో అభిప్రాయ సేకరణ, ఇంటింటి సర్వే నిర్వహించి, నివేదిక సమర్పించే అవకాశం ఉంది. దాన్ని ప్రభుత్వం ఆమోదించి, రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తుంది. దాని ఆధారంగా ఎన్నికలు జరిపే వీలుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని