కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌కు సర్వే గండి

ఒకవైపు కాంగ్రెస్‌ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్‌ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.

Updated : 25 Apr 2024 08:35 IST

పోటీకి సిద్ధమైన సత్యనారాయణ
మల్కాజిగిరి ఎంపీగానూ పోటీ చేస్తానని ప్రకటన

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: ఒకవైపు కాంగ్రెస్‌ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్‌ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న తమను కాదని.. ఇతర పార్టీల నేతలను చేర్చుకొని టికెట్లు ఇవ్వడమే ఇందుకు కారణం. కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా పని చేసిన సీనియర్‌ నేత సర్వే సత్యనారాయణ కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేశారు. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం ఆ పార్టీ తరఫున నామినేషన్‌ వేయడం గమనార్హం. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచీ పోటీకి దిగుతున్నట్లు తెలిపారు. గతంలో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా గెలిచిన సర్వేకు ఇక్కడ చెప్పుకోదగిన ఓటు బ్యాంకు ఉండటంతో నేతల్లో ఆందోళన నెలకొంది.

నలుగురిలో ముగ్గురిది భారాస..

రాజధాని పరిధిలోకి వచ్చే నాలుగు లోక్‌సభ స్థానాల్లో మూడింటిలో కాంగ్రెస్‌ నేతలకు కాకుండా భారాస నుంచి వచ్చిన నేతలకే టిక్కెట్లు ఇచ్చారు.

ఖైరతాబాద్‌ నుంచి గెలిచిన భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పార్టీలోకి చేర్చుకుని సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. చేవెళ్ల సిట్టింగ్‌ భారాస ఎంపీ రంజిత్‌రెడ్డిని అదే స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ బరిలో నిలిపింది. మల్కాజిగిరి స్థానం నుంచి భారాస నేత, వికారాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ సునీతా మహేందర్‌రెడ్డికి హస్తం కండువా కప్పి ఎంపీగా పోటీ చేయిస్తున్నారు. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అప్పటికప్పుడు భాజపా నేత శ్రీ గణేష్‌ను పార్టీలోకి చేర్చుకుని టికెట్‌ ప్రకటించారు.

సీనియర్‌ నేతల్లో అసంతృప్తి..

కంటోన్మెంట్‌ టికెట్‌ను సీనియర్‌ కాంగ్రెస్‌ నేత సర్వే సత్యనారాయణ ఆశించారు. గతంలో ఆయన ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో కొంతమేర కార్యకర్తల బలం ఉంది. ఈ నేపథ్యంలో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కొన్నేళ్లుగా ఆయన పార్టీలో చురుగ్గా లేరు.. దీంతో అభ్యర్థిత్వాన్ని ప్రాథమికంగానూ పరిశీలించలేదు. భాజపా నేత శ్రీ గణేష్‌ను పార్టీలోకి చేర్చుకుని ఆయనకు టికెట్‌ ఇచ్చారు. ఈ విషయంలో కనీసం తనకు చెప్పలేదని ఆగ్రహంతో ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌తో అమీతుమీ తేల్చుకోవాలన్న ఉద్దేశంతో కంటోన్మెంట్‌ నుంచి బరిలో దిగాలని నిర్ణయించారు. బుధవారం ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిగానే నామినేషన్‌ వేశారు. పార్టీ బీఫారం ఇవ్వదు కాబట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ను దెబ్బతీయడం కోసం ఆయన మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగానూ నామినేషన్‌ వేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్నది రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీ కాదని.. తెలుగుదేశం కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించారు. దీన్ని బట్టి చూస్తే ఆయన కాంగ్రెస్‌ పార్టీతో తెగదెంపులకే సిద్ధమయ్యారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. సర్వే సత్యనారాయణ 1985లో కంటోన్మెంట్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత సిద్ధిపేట నుంచి ఒకసారి, మల్కాజిగిరి నుంచి ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా కొంతకాలం పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని