‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్‌ ఇవ్వాల్సిందే’

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్‌ చేశారు.

Updated : 17 May 2024 05:55 IST

రాష్ట్రవ్యాప్తంగా భారాస శ్రేణుల నిరసనలు

ఈనాడు, హైదరాబాద్‌- రాంపూర్‌(కరీంనగర్‌), జనగామ టౌన్‌, నిజామాబాద్‌ అర్బన్‌- న్యూస్‌టుడే: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్‌ చేశారు. వ్యవసాయానికి కరెంటు, నీళ్లు ఇవ్వకుండా చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు పండించిన వడ్లను కూడా కొనుగోలు చేయకుండా గోస పెడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ.. భారాస అధినేత కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కల్లాల వద్ద రైతులతో కలసి ఆందోళనలు చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులపై ధర్నాలు చేశారు.

ఓట్లు పడగానే సీఎం మాట మార్చారు

కరీంనగర్‌లో జరిగిన నిరసనలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, భారాస నాయకులు రైతు ధర్నా నిర్వహించారు. ఓట్లు పడగానే సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చారని, కేవలం సన్నరకం వడ్లకే రూ.500 బోనస్‌ ఇస్తామనడం మోసపూరిత చర్య అని మాజీ మంత్రి పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లను గుర్తించే విధానం లేదని, ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు వచ్చినా ఇప్పటివరకు 33 లక్షల టన్నులే కొన్నారన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 95 లక్షల మెట్రిక్‌ టన్నులు కొన్నామని గంగుల గుర్తు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలుచోట్ల భారాస శ్రేణులు ఆందోళన చేశాయి. వరంగల్‌ జిల్లా ఖానాపురం, మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం, జనగామతో పాటు పాలకుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద స్థానిక నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనగామలో నిర్వహించిన ధర్నాలో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు దొడ్డురకం ధాన్యానికి బోనస్‌ ఇస్తామని చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక రైతులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. దొడ్డురకం ధాన్యానికి కూడా రూ.500 బోనస్‌ చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌తో పాటు నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల్లో భారాస నేతలు ధర్నాలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌.. అధికారంలోకి వచ్చాక ఎందుకు ఇవ్వడం లేదని నిజామాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు, నిజామాబాద్‌ మేయర్‌ నీతూకిరణ్‌ ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌, మునుగోడు తదితర ప్రాంతాల్లో భారాస నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని