అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం.

Updated : 18 May 2024 06:37 IST

హైదరాబాద్‌ వెళ్లినట్లు సమాచారం

ఇటీవల సీఎం జగన్‌తో పిన్నెల్లి సోదరులు

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్‌కు వెళ్లినట్లు సమాచారం. శుక్రవారం వేకువజామునే సాగర్‌ మీదుగా హైదరాబాద్‌ వెళుతూ సాగర్‌ చెక్‌పోస్టు వద్ద గన్‌మెన్లను వెనక్కి పంపేశారు. ఈ విషయాన్ని గన్‌మెన్లు ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ నెల 13న, ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి సృష్టించిన అరాచకాన్ని రాష్ట్రం మొత్తం చూసింది. తెదేపా అభ్యర్థి బ్రహ్మారెడ్డి వాహనాన్ని తగలబెట్టడం, రెంట చింతల మండలంలో తెదేపా ఏజెంట్లపై గొడ్డళ్లతో దాడి, పాల్వాయిగేటులో ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేయడం, సొంతూరు కండ్లకుంటలో సోదరుడు వెంకట్రామిరెడ్డి అరాచకం, మరుసటి రోజు కారంపూడిలో పరామర్శ పేరిట సాగించిన మరో విధ్వంస కాండ, తెదేపా కార్యాలయంలో ఫర్నిచర్‌ ధ్వంసం, కారుకు నిప్పుపెట్టడం ఇలా..పలు దాడులు, విధ్వంసాలకు పాల్పడ్డారు.

ఈ నేపథ్యంలో పోలీసులు వారిద్దరినీ మాచర్లలో గృహ నిర్బంధం చేశారు. పల్నాడులో జరుగుతున్న హింసపై హైకోర్టు సైతం చీవాట్లు వేసిన విషయం తెలిసిందే. ఎస్పీ సహా ఏడుగురు పోలీసు అధికారులపై వేటు, కలెక్టర్‌ బదిలీతో వారిద్దరి కాళ్లకు బంధం పడింది. అంతేకాకుండా సిట్‌ నివేదిక ఆధారంగా అరెస్టులు ఉండనున్న నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు పరారీ అయినట్టు తెలుస్తోంది. ఇరవై ఏళ్లుగా ఏలుతున్న గడ్డలో అరెస్టు అయితే అవమానకరంగా ఉంటుందని, అందుకే పొరుగు రాష్ట్రంలో తలదాచుకునేందుకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు అయ్యాక కొన్నిరోజులపాటు విశ్రాంతి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లడం మామూలేనని, గన్‌మెన్లను కూడా వదిలేసి వెళుతుంటారని వైకాపా నాయకులు చెబుతున్నారు. కాగా, పరారైనట్లు వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే పిన్నెల్లి స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, వ్యక్తిగత పనులపై హైదరాబాద్‌ వచ్చానని మీడియాకు సమాచారమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు