తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం

పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు.

Published : 18 May 2024 05:31 IST

మాచవరం ఎంపీపీ కుమారుడిపై దాడి కేసులో ఏకపక్ష వైఖరి
తమను హింసించారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లిన బాధితులు
వైద్య పరీక్షలకు ఆదేశం.. గాయాలైనట్లు వైద్యుల పరిశీలనలో వెల్లడి

వీపుపై కమిలిపోయిన గాయాలు చూపుతున్న నిఖిల్‌

ఈనాడు, అమరావతి-న్యూస్‌టుడే, గుంటూరు (నగరంపాలెం): పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. వారు కొట్టిన దెబ్బలకు బాధితుల శరీరంపై ఎర్రగా కమిలిన గాయాలయ్యాయి. నడవలేని స్థితిలో ఉన్న నిఖిల్, శ్రీకాంత్, టి.రమేష్, యు.రమేష్, జి.రమేష్, కె.వెంకటేశ్వర్లుతో పాటు వృద్ధుడు వై.మోహనరావును పోలీసులు శుక్రవారం సత్తెనపల్లి కోర్టులో హాజరుపర్చారు. పోలీసులు తమను దారుణంగా కొట్టారని బాధితులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి, నివేదిక అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నెల 14న తమపై మోర్జంపాడు గ్రామానికి చెందిన ఏడుగురు తెదేపా కార్యకర్తలు, సానుభూతిపరులు దాడి చేశారని మాచవరం ఎంపీపీ కుమారుడు లక్ష్మీరెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన మాచవరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

బూటు కాలితో తన్నడంతో పొట్టపై గాయమైందని చూపుతున్న శ్రీకాంత్‌  

ఎంపీపీ కుమారుడిపై తాము దాడి చేయలేదని చెప్పినా.. వినిపించుకోలేదని, తమను అన్యాయంగా కేసులో ఇరికించి చావబాదారని శుక్రవారం జీజీహెచ్‌ వద్ద మీడియాతో బాధితులు వాపోయారు. పోలీసులు తమను కాళ్లు చేతులపైనే కాకుండా మర్మాంగాలపై కూడా కొట్టారని, గొంతుపై బూటు కాలు మోపారని వివరించారు. దాడితో సంబంధం లేకపోయినా.. మేమే చేశామని ఒప్పుకోవాలని పోలీసులు తమపై ఒత్తిడి తీసుకొచ్చారని నిఖిల్, శ్రీకాంత్, రమేష్‌లు వాపోయారు. మరోవైపు నిందితులకు గాయాలేవీ కాలేదని నివేదిక ఇవ్వాలని పోలీసులు వైద్యులపై సైతం ఒత్తిడి చేసినట్లు సమాచారం. వైద్యులు అవేమీ పట్టించుకోకుండా నిందితులకు గాయాలయ్యాయని నివేదిక సమర్పించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు