తెదేపాకు ఓటేయాలన్నందుకు.. దంపతులపై దాడి

తెదేపాకు ఓటేయాలని చెప్పినందుకు కర్నూలు జిల్లా కోడుమూరు ఇంద్రజిత్‌గుప్తా నగర్‌కు చెందిన దంపతులపై గురువారం రాత్రి దాడి చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

Published : 18 May 2024 03:53 IST

కోడుమూరులో తెదేపా నాయకుడికి బెదిరింపులు

కోడుమూరు ఎస్సై బాలనరసింహులుకు ఫిర్యాదు అందజేస్తున్న వెంకటరాముడు

ఈనాడు, కర్నూలు, కోడుమూరు పట్టణం: తెదేపాకు ఓటేయాలని చెప్పినందుకు కర్నూలు జిల్లా కోడుమూరు ఇంద్రజిత్‌గుప్తా నగర్‌కు చెందిన దంపతులపై గురువారం రాత్రి దాడి చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. కోడుమూరుకు చెందిన వెంకటరాముడు అలియాస్‌ బ్రిటిష్‌రాముడు, రామేశ్వరి దంపతులు కూల్‌డ్రింక్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. వెంకటరాముడు టీఎన్‌టీయూసీ విభాగంలో పనిచేస్తున్నారు. ఆయనకు ఇటీవల రోడ్డుప్రమాదంలో కాలికి గాయమైంది. గురువారం రాత్రి 10.30కు ఇంటిముందు కూర్చుని కట్టు మారుస్తుండగా.. శ్రీరాములు, జగదీశ్, గోపి, మద్దిలేటి తదితరులు వచ్చి ఎన్నికల రోజున తెదేపాకు అనుకూలంగా ఎందుకు ప్రచారం చేశావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన భార్య రామేశ్వరినీ అసభ్యకరమైన పదాలతో దూషించారు. నడవలేని స్థితిలో ఉన్న వెంకటరాముడిపై దాడిచేయడంతో ఆయన కింద పడ్డారు. రామేశ్వరిపైనా దాడిచేయగా, ఆమె ఎదురుతిరిగారు. స్థానికులు రావడంతో వారు పారిపోయారు. తమపై దాడి చేశారని దంపతులు కోడుమూరు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వెళ్లకపోతే అంతం చేస్తామన్నారు

కోడుమూరుకు చెందిన తెదేపా నాయకుడు లింగం బాలకృష్ణయ్యనూ వైకాపా కార్యకర్తలు బెదిరించిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆయనకు 249వ బూత్‌ పరిశీలకుడి బాధ్యతలను తెదేపా అప్పగించింది. పోలింగ్‌రోజు బూత్‌ దగ్గరకు వెళ్లగా ఆయననూ అంతం చేస్తామంటూ కొందరు బెదిరించారన్నది ఆరోపణ. గురువారం రాత్రి కూడా కొందరు ఇంటికి వచ్చి అంతం చేస్తామంటూ హెచ్చరించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాముల శ్రీనివాసులు, రమేశ్‌నాయుడు తనను బెదిరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదుచేసినట్లు కోడుమూరు ఎస్సై బాలనరసింహులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని