విశాఖలో జరిగింది చిన్న సంఘటనే

జూన్‌ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో వైకాపాకు 175 సీట్లకు దగ్గరగా వస్తాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Published : 18 May 2024 03:57 IST

మంత్రి బొత్స సత్యనారాయణ 

ఈనాడు, విశాఖపట్నం: జూన్‌ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో వైకాపాకు 175 సీట్లకు దగ్గరగా వస్తాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రెండోసారి సీఎంగా జగన్‌ జూన్‌ 9న విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. శుక్రవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఉత్తరాంధ్రలో అంతా సోదరభావంతో ఉంటారు. అటువంటిది విశాఖ పార్లమెంటు పరిధిలో జరిగిన ఓ చిన్న సంఘటనపై కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. ఆ సంఘటన రాజకీయ ప్రలోభంతో కక్షపూరితంగా జరిగితే చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పా’ అని మంత్రి బొత్స వివరించారు. రాజకీయ నాయకులు హింసను ప్రోత్సహించేలా మాట్లాడొద్దని.. దానికి వైకాపా పూర్తి వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. జగన్‌ విశాఖలోని రుషికొండ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా ‘వేదిక ఎక్కడనేది త్వరలోనే వెల్లడిస్తాం. ప్రమాణ స్వీకారం తర్వాత ఆ భవనాలను ఏ అవసరాల కోసం వినియోగించాలో ఆలోచిస్తాం’అని చెప్పారు. విశాఖ రాజధాని అంశం న్యాయస్థానంలో ఉంది కదా? అని అడగ్గా ‘విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పాం. విజయం సాధించాక ప్రజలు ఆ నిర్ణయానికి పట్టం కట్టారని కోర్టుకు తెలియజేసి ప్రజాతీర్పును గౌరవించాలని అభ్యర్థిస్తాం’ అని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో తమ పార్టీ మీద ఆధారపడే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని