అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్‌ బాక్సుల తరలింపు!

ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

Published : 18 May 2024 05:33 IST

కేవలం వైకాపా నాయకులకు మాత్రమే సమాచారం!
ఇతర పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు లేకుండానే ప్రక్రియ
ఓట్లను మార్చేశారని తెదేపా ఆరోపణ
విజయనగరంలో ఉద్రిక్త పరిస్థితులు

స్ట్రాంగ్‌ రూమ్‌లో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అల్లుడు
ఈశ్వర్‌ కౌశిక్, వైకాపా విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు

ఈనాడు, విజయనగరం-న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం: ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. విజయనగరంలో తహసీల్దారు కార్యాలయం నుంచి పోస్టల్‌ బ్యాలట్‌ పెట్టెల తరలింపు తీరు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. వైకాపా నాయకులు తప్ప.. మిగిలిన అభ్యర్థులు, వారి ఏజెంట్లను పిలవకుండా స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి ఎంపీ అభ్యర్థికి సంబంధించిన బ్యాలట్లను లెక్కింపు కేంద్రాలకు తీసుకెళ్లడంపై తెదేపా నాయకులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై అర్ధరాత్రి వరకు వివాదం జరిగింది.

స్ట్రాంగ్‌ రూమ్‌లో ఫోన్‌ మాట్లాడుతున్నఈశ్వర్‌ కౌశిక్‌

ఇదీ జరిగింది..

విజయనగరంలోని తహసీల్దారు కార్యాలయాన్ని పోస్టల్‌ బ్యాలట్ల స్ట్రాంగ్‌ రూమ్‌గా వినియోగించారు. ఈ నెల 16న మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల వారీగా బ్యాలట్లను విభజించి లెక్కింపు కేంద్రాలకు తీసుకెళ్లాలి. ఈ మేరకు ముందుగానే అన్ని పార్టీల అభ్యర్థులు, వారి ఏజెంట్లకు సమాచారం ఇవ్వాలి. సీసీ కెమెరాల పర్యవేక్షణలో వీడియో రికార్డింగ్‌ చేస్తూ పెట్టెలను వేరు చేయాలి. అనంతరం పోలీసు బందోబస్తుతో తరలించాలి. కానీ.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అల్లుడు ఈశ్వర్‌ కౌశిక్, వైకాపా నేత, విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు అధికారులతో కలిసి స్ట్రాంగ్‌ రూమ్‌ లోపలికి వెళ్లారు. విషయం తెలిసి ఇతర అభ్యర్థులు, ఏజెంట్లు వచ్చేలోగా బాక్సులను విభజించి, ఎంపీ అభ్యర్థికి సంబంధించిన బ్యాలట్లను తరలించేశారు. దీనిపై వివాదం తలెత్తడంతో అసెంబ్లీ నియోజకవర్గం బ్యాలట్లను మాత్రం అక్కడే ఉంచేశారు. 

విలేకరులతో మాట్లాడుతున్న అదితి గజపతిరాజు. చిత్రంలో కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు

తెదేపా ఆందోళన..

కావాలనే సమాచారం ఇవ్వకుండా స్ట్రాంగ్‌రూమ్‌ను తెరిచారని తెదేపా నేతలు మండిపడుతున్నారు. గురువారం రాత్రి విజయనగరం నియోజకవర్గ ఎన్నికల అధికారి, జేసీ కె.కార్తీక్‌ను వారు కలిశారు. కేవలం వైకాపా నాయకుల సమక్షంలో ప్రక్రియ నిర్వహించడం ఏంటని నిలదీశారు. ఓట్లను గల్లంతు చేసి, డూప్లికేట్‌ పత్రాలు పెట్టారని ఆరోపించారు. రాత్రి 10 గంటల సమయంలో కూటమి విజయనగరం నియోజకవర్గ అభ్యర్థిని అదితి గజపతిరాజు తహసీల్దారు కార్యాలయానికి వెళ్లారు. సీసీ టీవీ ఫుటేజీ అడగ్గా.. అక్కడి అధికారులు చాలాసేపటి వరకు ఇవ్వలేదు. 11 గంటల తరువాత ఇచ్చారు. దీనిపై శుక్రవారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్‌ నాగలక్ష్మికి ఫిర్యాదు చేశారు. అనంతరం డీఆర్వో అనితను కలిశారు. అదితి వెంట ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఉన్నారు.

వీర విధేయుడిగా పేరు..

ఇక్కడ ఏఆర్వోగా తహసీల్దారు పీవీ.రత్నం వ్యవహరిస్తున్నారు. ఆయన కోలగట్ల వీరభద్రస్వామికి వీర విధేయుడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.స్ట్రాంగ్‌ రూంలోకి అభ్యర్థి లేదా జనరల్‌ ఏజెంట్‌కే మాత్రమే అనుమతించాల్సి ఉందని, కానీ అందరినీ తీసుకెళ్లారని తెదేపా నాయకులు చెబుతున్నారు. శుక్రవారం సంబంధిత వీడియోలను అదితి గజపతిరాజు మీడియా ముందు ప్రదర్శించారు. బాక్సులను కలెక్టరేట్‌కు తరలించే సమయంలో వైకాపాకు చెందిన వాహనం కూడా వెళ్లిందని చెప్పారు. ఇద్దరు అనధికారిక వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగిందని, కచ్చితంగా ఓట్లను గల్లంతు చేశారని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

ఈ ప్రశ్నలకు బదులేదీ?

 వైకాపా ఎమ్మెల్యే అల్లుడు కౌశిక్, ముఖ్య అనుచరుడు మామిడి అప్పలనాయుడు అనధికార వ్యక్తులే. వారి సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌ ఎలా తెరుస్తారు? స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఇద్దరూ లోపలికి ఎలా వెళ్తారు. ఆ సమయంలో వారు ఎవరితో మాట్లాడుతున్నారు?. చరవాణులతో వారిని ఎలా అనుమతించారు? సీసీటీవీ ఫుటేజీ అడిగితే ఇవ్వడానికి ఎందుకు ఎక్కువ సమయం తీసుకున్నారు.


అప్పటికప్పుడే మరమ్మతులు..

గురువారం నాటికి విజయనగరం తహసీల్దారు కార్యాలయ కిటికీ దుస్థితి

స్ట్రాంగ్‌ రూమ్‌గా వినియోగించిన తహసీల్దారు కార్యాలయం శిథిలావస్థకు చేరింది. బ్యాలట్‌ పెట్టెలున్న గది కిటికీలు పాడయ్యాయి. దీనిపై అదితి గజపతిరాజు తహసీల్దారు రత్నంను ప్రశ్నించారు. దీంతో గురువారం రాత్రి చెక్కలు పెట్టి, మేకులు కొట్టారు. శుక్రవారం ఉదయం ఏకంగా ఇటుకలతో కప్పేశారు. అప్పటికప్పుడు పనులు చేయడం, ఇంతవరకు కనీసం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా గురువారం వరకు బందోబస్తుగా ఇక్కడ ఒక్కరే సిబ్బంది ఉండేవారు.

శుక్రవారం నాడు కిటికీలు మూసేసి సిమెంటు పనులు చేస్తున్న కార్మికులు

తెదేపా ఆందోళన నేపథ్యంలో శుక్రవారం నుంచి మరొకరిని నియమించారు. మరోవైపు తాము అభ్యర్థులకు తెలియజేశామని జిల్లా ఎన్నికల అధికారి తరఫున కలెక్టరేట్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల తరఫున హాజరైన వారి సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ తెరిచామని పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని