విదేశాలకు తరలిపోతున్నారా..?

ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

Published : 18 May 2024 05:32 IST

లండన్‌కు జగన్‌.. ఇతర దేశాలకు పెద్దిరెడ్డి కంపెనీలు
వీసాలు, పాస్‌పోర్టులు తీసుకొనే పనిలో వైకాపా నేతలు
మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజం

ఈనాడు డిజిటల్, అమరావతి: ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అందుకోసం వారంతా వీసాలు, పాస్‌పోర్టులు తీసుకొనే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. చిత్తూరులో పెద్దిరెడ్డికి చెందిన పీఎల్‌ఆర్‌ ప్రాజెక్టు యంత్ర పరికర వాహనాన్ని వేరే దేశానికి తరలించడమే అందుకు నిదర్శనమన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘లండన్‌ వెళుతున్న జగన్‌ తిరిగి వస్తారో లేదో అన్న సందేహం.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే వైకాపా సామాజిక మాధ్యమ విభాగాన్ని మూసేసి.. సజ్జల భార్గవ్‌రెడ్డి హైదరాబాద్‌ వెళ్లిపోయారు’’ అని పేర్కొన్నారు.

హింసాత్మక ఘటనలకు సీఎస్‌  జవహర్‌రెడ్డే బాధ్యుడు: ‘‘పోలింగ్‌ సమయంలో, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున చెలరేగిన హింసాత్మక ఘటనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డే బాధ్యుడు. పోలింగ్‌ రోజు ఎక్కడెక్కడ ఏ అధికారి ఉండాలో రాజేంద్రనాథరెడ్డి డీజీపీగా ఉన్నప్పుడే నిర్ణయమైంది. కీలక స్థానాల్లో బాధ్యత గల అధికారుల్ని ఉంచకపోవడంతోనే పెద్దఎత్తున అరాచకం చెలరేగింది. ఇదంతా సీఎస్, సీఎంవో అధికారి ధనుంజయ్‌రెడ్డి, మాజీ నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి కనుసన్నల్లోనే జరిగింది. ఇప్పటికీ వైకాపా వాళ్లు దాడులను ఆపలేదు. ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ పరిధి దాటి వ్యవహరిస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల్లో వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, జగన్‌ క్యాబినెట్‌లోని మంత్రులు కూడా ఓడిపోనున్నారని దేవినేని ఉమా పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని