ఔరంగజేబు స్ఫూర్తి కాంగ్రెస్‌ నేతల్లో ప్రవేశించింది

మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి మన కాంగ్రెస్‌ నేతల్లో ప్రవేశించింది. అందుకే అప్పట్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తరహాలో ఇప్పుడు వీరు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేద్దామని అనుకుంటున్నారు.

Updated : 18 May 2024 06:18 IST

మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి మన కాంగ్రెస్‌ నేతల్లో ప్రవేశించింది. అందుకే అప్పట్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తరహాలో ఇప్పుడు వీరు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేద్దామని అనుకుంటున్నారు. ఇది ప్రమాదకరం. ప్రజల ఆస్తులు, హక్కులను ఇది లాక్కొనిపోతుంది. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా వారు అనుకుంటున్నారు. పాకిస్థాన్‌ను కీర్తించేవారు మన దేశానికి భారం. వారు ఇక్కడ ఉండడానికి వీల్లేదు.

బిహార్‌లోని సారణ్‌లో యూపీ సీఎం ఆదిత్యనాథ్‌


ఆదివాసీలను తరిమికొట్టేందుకు మోదీ సర్కారు యత్నం

సొంతభూముల నుంచి ఆదివాసీలను తరిమికొట్టేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోంది. వారి హక్కుల్ని లాక్కోవాలని, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ద్వారా వివిధ వర్గాల మధ్య విభేదాలు పెంచాలని చూస్తోంది. అందుకే జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ) అమలుకు సిద్ధపడుతోంది. నియంతృత్వాన్నే భాజపా నమ్ముతుంది. ఏక పార్టీ పాలనను కోరుతుంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద ఎవరైనా దరఖాస్తు చేశారంటే వారిని తరిమికొట్టేస్తారు. 

పశ్చిమబెంగాల్‌లోని ప్రచార సభల్లో సీఎం మమతాబెనర్జీ


మోదీ అంటే హిందీ రాని ఇటలీవాసి కాదు

సోనియాగాంధీ మాదిరిగా ప్రధాని మోదీ.. హిందీ రాని ఇటలీవాసి కాదు. పహారీ సహా అనేక భాషలు ఆయనకు వచ్చు. దేశాభివృద్ధికి పాటుపడుతున్న భూమి పుత్రుడాయన. సుపరిపాలనకు మారుపేరు. పేద కుటుంబంలో పుట్టి, వారి సంక్షేమానికి, దేశాభివృద్ధికి పాటుపడుతున్నారు. భాజపా అనేది సామాన్యుల పార్టీ. ఇక్కడ టీ విక్రేత కూడా ప్రధాని కాగలరు.

కుల్లూ జిల్లాలో మండీ లోక్‌సభ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్‌


మోదీ మాటల్ని పార్టీ నేతలూ అనుసరించాలి

హిందూ-ముస్లిం విభజనవాదంతో రాజకీయాలు చేసేవారికి ప్రజా జీవితంలో విలువ ఉండదని ప్రధాని మోదీ చెప్పడం అభిలషణీయం. అంతకు ముందు ఆయనే ముస్లింలను చొరబాటుదారులని, ఎక్కువ మంది పిల్లలను కంటారని చేసిన వ్యాఖ్యలతో జరిగిన నష్టాన్ని గుర్తించి దిద్దుబాటుగా ఈ మాటలు చెప్పి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ప్రధాని మాటలను ఆయన పార్టీ నేతలు కూడా అనుసరిస్తే మంచిదే కదా!

‘ఎక్స్‌’లో శేఖర్‌ గుప్తా, పాత్రికేయులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని