మాలీవాల్‌పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్‌

తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) శుక్రవారం ఆరోపించింది.

Published : 18 May 2024 04:44 IST

దిల్లీ: తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) శుక్రవారం ఆరోపించింది. ఈ వ్యవహారంలో స్వాతి ఓ పావు మాత్రమేనని పేర్కొంది. కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడిపై ఆమె చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఖండించింది. అపాయింట్‌మెంట్‌ లేకుండా ముఖ్యమంత్రి ఇంటికి స్వాతి చేరుకున్నారని, కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేయడమే ఆమె ఉద్దేశమని ఆప్‌ సీనియర్‌ నేత ఆతిశీ పేర్కొన్నారు. ‘‘ఈ రోజు ఓ వీడియో వ్యాప్తిలోకి వచ్చింది. అది మాలీవాల్‌ అబద్ధాలను వెలుగులోకి తెచ్చింది. ఎఫ్‌ఐఆర్‌లో ఆమె చేసిన ఆరోపణలన్నీ అసత్యమని ఆ వీడియో స్పష్టం చేస్తోంది. డ్రాయింగ్‌ రూంలో ఆమె సౌకర్యంగా కూర్చున్నట్లు కనిపిస్తున్నారు. అంతేకాకుండా భద్రతా సిబ్బందిని ఆమె బెదిరిస్తున్నట్లూ ఉంది. కేజ్రీవాల్‌తో భేటీకి ఆమె పట్టుబట్టారు. రాజ్యసభ సభ్యురాలైన ఆమెకు సీఎం బిజీ షెడ్యూల్‌ గురించి తెలిసుండాలి. ముఖ్యమంత్రి తీరికలేకుండా ఉన్నారు..కలవడం కుదరదని బిభవ్‌ ఆమెకు స్పష్టం చేశారు. దీంతో ఆయనపై ఆమె అరిచారు. ఆయన్ను తోసేసి ముఖ్యమంత్రి నివాసంలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు’’ అని ఆతిశీ వివరించారు. ‘‘ఈ మొత్తం సంఘటన భాజపా కుట్రను నిరూపిస్తోంది. కేజ్రీవాల్‌ను ఇరుకునపెట్టేందుకు స్వాతి మాలీవాల్‌ ఆ పార్టీకి పావుగా మారారు. బిభవ్‌ కుమార్‌ కూడా స్వాతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు’’ అని ఆమె తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని