లద్దాఖ్‌లో హోరాహోరీ

కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ భాజపా, కాంగ్రెస్‌ మధ్యే ముఖాముఖి పోటీ ఉంటుందని తొలుత భావించగా.. స్థానికంగా గట్టి పట్టున్న ఓ గ్రూపు స్వతంత్ర అభ్యర్థిని బరిలో దించడంతో పోరు త్రిముఖంగా మారింది.

Updated : 19 May 2024 05:44 IST

కాక పుట్టిస్తున్న త్రిముఖ పోరు

తాశీ గ్యాల్సన్‌            సెరింగ్‌ నామ్‌గ్యాల్‌

కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ భాజపా, కాంగ్రెస్‌ మధ్యే ముఖాముఖి పోటీ ఉంటుందని తొలుత భావించగా.. స్థానికంగా గట్టి పట్టున్న ఓ గ్రూపు స్వతంత్ర అభ్యర్థిని బరిలో దించడంతో పోరు త్రిముఖంగా మారింది. ఆరో షెడ్యూల్‌లో చేర్పు, రాష్ట్ర హోదా వంటి డిమాండ్లతో లద్దాఖ్‌ కొన్ని నెలలుగా అట్టుడుకుతున్న నేపథ్యంలో ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ సమరం అయిదో దశలో భాగంగా ఈ నెల 20న ఇక్కడ పోలింగ్‌ జరగనుంది.

హ్యాట్రిక్‌పై భాజపా కన్ను

లద్దాఖ్‌లో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ భాజపా గెలుపొందింది. హ్యాట్రిక్‌పై కన్నేసిన ఆ పార్టీ.. ఈసారి సిటింగ్‌ ఎంపీ జమ్యాంగ్‌ సెరింగ్‌ నామ్‌గ్యాల్‌ను తప్పించి, తాశీ గ్యాల్సన్‌కు టికెట్‌ ఇచ్చింది. గ్యాల్సన్‌ ప్రస్తుతం లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (లేహ్‌) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిలర్‌ - ఛైర్మన్‌గా ఉన్నారు. కాంగ్రెస్‌ సెరింగ్‌ నామ్‌గ్యాల్‌ అనే మరో నాయకుడికి (సిటింగ్‌ ఎంపీ కాదు) బరిలో దించింది. లద్దాఖ్‌ ప్రజల తరఫున పలు నిరసన కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్న కార్గిల్‌ డెమోక్రటిక్‌ అలియన్స్‌ (కేడీయే) హనీఫా జాన్‌ను పోటీలో నిలిపింది. విపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ (ఎన్‌సీ) ఇక్కడ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. 

అతిపెద్ద నియోజకవర్గం 

వైశాల్యం పరంగా దేశంలోకెల్లా అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం లద్దాఖ్‌. 173.26 చదరపు కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంది. 2019లో జమ్మూకశ్మీర్‌ నుంచి విడిపోయి కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత లద్దాఖ్‌లో జరుగుతున్న తొలి ప్రధాన ఎన్నికలు ఇవే. ఈ స్థానాన్ని అత్యధికంగా కాంగ్రెస్‌ ఆరుసార్లు గెల్చుకుంది. ఇక్కడ ఓటర్ల సంఖ్య 1.84 లక్షలకు పైగా ఉంది. వీరిలో 95 వేలమందికిపైగా.. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉండే కార్గిల్‌ జిల్లాలోనే ఉన్నారు.

నాలుగేళ్లుగా పోరుబాట 

లద్దాఖ్‌ను పూర్తిస్థాయి రాష్ట్రంగా ఏర్పాటుచేయాలని స్థానికులు నాలుగేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. తమ ప్రాంతాన్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలనీ కోరుతున్నారు. వారి డిమాండ్లను కేంద్ర సర్కారు ఈ ఏడాది మార్చిలో తిరస్కరించింది. అప్పటి నుంచి కేడీయే, లేహ్‌ అపెక్స్‌ బాడీ (ఎల్‌ఏబీ)ల నేతృత్వంలో స్థానికంగా నిరసనలు ఉద్ధృతమయ్యాయి. లేహ్‌లో మార్చి 6న పూర్తిస్థాయి బంద్‌ను పాటించారు. భాజపాపై వ్యతిరేకత పెరిగింది. టికెట్‌ రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన సిటింగ్‌ ఎంపీ జామ్యాంగ్‌ సెరింగ్‌ నమ్‌గ్యేల్‌ అన్యమనస్కంగానే పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. తాను గెలిస్తే.. స్థానికుల డిమాండ్ల సాధన దిశగా కేంద్రం, లద్దాఖ్‌ నాయకత్వం మధ్య చర్చల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తానంటూ గ్యాల్సన్‌ ఓట్లు అడుగుతున్నారు. లద్దాఖ్‌ను ఆరో షెడ్యూల్‌లో చేరుస్తామంటూ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ తనను గెలిపిస్తుందని నామ్‌గ్యాల్‌ ధీమాగా చెబుతున్నారు. అయితే గతంలో రెండుసార్లు ఈ సీటును గెల్చుకున్న ఎన్‌సీ నుంచి హస్తం పార్టీకి ఆశించిన స్థాయిలో మద్దతు అందడం లేదు. కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతివ్వాలంటూ తమ అధినాయకత్వం ఒత్తిడి చేయడం కార్గిల్‌లో ఎన్‌సీ నేతలకు నచ్చలేదు. తిరుగుబావుటా ఎగరేసి మార్చి 6న పార్టీకి వారంతా రాజీనామా చేశారు. జాన్‌ ఎన్నికల బరిలో దిగడం కూడా కాంగ్రెస్‌కు ఇబ్బందే. స్థానికంగా మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా కేడీఏ ఒప్పించింది. లద్దాఖ్‌లో గతంలో మూడుసార్లు స్వతంత్రులు గెలుపొందడం జాన్‌కు సానుకూలాంశం. 


బారాముల్లాలో నువ్వానేనా!

బరిలో ఒమర్‌ అబ్దుల్లా, సజ్జాద్‌ లోన్‌

ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ స్థానంలో నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ అగ్రనేత ఒమర్‌ అబ్దుల్లా, పీపుల్స్‌ కాన్ఫెరెన్స్‌ అగ్ర నాయకుడు సజ్జాద్‌ లోన్‌ నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నారు. వారికి మాజీ ఎమ్మెల్యే షేక్‌ అబ్దుల్‌ రషీద్‌ అలియాస్‌ ఇంజినీర్‌ రషీద్‌ గట్టి సవాలు విసురుతున్నారు. ఈ నియోజకవర్గంలో మే 20న పోలింగ్‌ జరగనుంది. 

హోరాహోరీ సమరాలు 

బారాముల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువే. వేర్పాటువాదం, ముష్కరుల దాడులు బాగా ఎక్కువగా ఉన్న రోజుల్లోనూ.. కశ్మీర్‌లోని మిగిలిన రెండు లోక్‌సభ నియోజకవర్గాలతో (శ్రీనగర్, అనంతనాగ్‌) పోలిస్తే ఇక్కడ పోలింగ్‌ శాతం అధికంగా నమోదవుతూ ఉండేది. బారాముల్లా, కుప్వాడా, బాందీపొరా, బడ్‌గామ్‌ జిల్లాల పరిధిలోని 18 అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ఎన్నికలు ఎప్పుడూ హోరాహోరీగా సాగుతుంటాయి. 

ప్రముఖుల పోటీతో ఉత్కంఠ

విపక్ష ఇండియా కూటమి ఈ స్థానాన్ని ఎన్‌సీకి కేటాయించింది. ఆ పార్టీ తరఫున బరిలో నిలిచిన ఒమర్‌ అబ్దుల్లాకు కాంగ్రెస్‌ మద్దతు పెద్ద సానుకూలాంశం. సజ్జాద్‌ లోన్‌కు భాజపాతో సన్నిహితంగా మెలిగే జమ్మూకశ్మీర్‌ అప్నీ పార్టీ వంటి పక్షాల మద్దతు ఉంది. ఒమర్, లోన్‌ పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకుంటూ ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఒమర్‌ను రాజకీయ పర్యాటకుడిగా లోన్‌ పేర్కొంటుండగా.. లోన్‌ను భాజపా మనిషిగా ఒమర్‌ ఆరోపిస్తున్నారు. 

సానుభూతిపై ఆశతో ఇంజినీర్‌ రషీద్‌

బారాముల్లా బరిలో ఉన్న మరో అభ్యర్థి ఇంజినీర్‌ రషీద్‌నూ తక్కువగా అంచనా వేయలేం. 2019 ఎన్నికల్లో ఆయన లక్షకుపైగా ఓట్లు దక్కించుకొని మూడో స్థానంలో నిలిచారు. నాడు పీడీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల కంటే ఆయన ఖాతాలోనే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఉగ్ర నిధుల కేసులో అయిదేళ్ల కిందట అరెస్టయిన రషీద్‌ ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్నారు. స్థానికుల్లో ఆయనపై ఉన్న సానుభూతి ఓట్ల రూపంలోకి మారే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రషీద్‌ భారీగా ఓట్లు చీలిస్తే.. లోన్‌ లాభపడతారని అంచనా వేస్తున్నారు.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని