ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యంతో పాటు ప్రతి గింజను ప్రభుత్వం కొనాలని, హామీ మేరకు వరి క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని రాష్ట్ర భాజపా నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు.

Published : 19 May 2024 02:30 IST

అన్ని రకాల వడ్లకు బోనస్‌ ఇవ్వాలి
సీఎంకు భాజపా ఎమ్మెల్యేల వినతి 
 

సీఎంకు వినతిపత్రం ఇస్తున్న మహేశ్వర్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, రామారావు పటేల్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యంతో పాటు ప్రతి గింజను ప్రభుత్వం కొనాలని, హామీ మేరకు వరి క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని రాష్ట్ర భాజపా నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పించాలన్నారు. సచివాలయంలో శనివారం భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, రామారావుపటేల్‌ సీఎంను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ‘‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 45 రోజులవుతున్నా ఇంకా కొనుగోళ్లు జరగక అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన ఏర్పాట్లు లేక ధాన్యం తడుస్తోంది. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినా అది అమలు కాక రైతులు నష్టపోతున్నారు. మిల్లర్ల వద్దకు వెళితే బస్తాకు నాలుగు కిలోలు కోతపెడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సీఎంను కోరాం. రైతు బంధుతో పాటు, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, కౌలు రైతులకు రూ.15 వేలు, కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలని విన్నవించాం. మా వినతిపై ప్రభుత్వం స్పందించకుంటే భాజపా ఉద్యమ కార్యాచరణ చేపడుతుంది’’ అని ఎమ్మెల్యేలు తెలిపారు.

తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తాం: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ఎప్పటికైనా తెలంగాణలో భాజపా కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌లో మంత్రుల మధ్య గొడవలు జరిగి ప్రభుత్వాన్ని వారే కూల్చుకుంటే తాము చేసేదేం లేదని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది నుంచి పది స్థానాలను భాజపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి, తాను 15 ఏళ్లుగా మాట్లాడుకోవడం లేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని