ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు

సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది.

Published : 19 May 2024 02:59 IST

 నగదులో తెలంగాణ... డ్రగ్స్‌లో గుజరాత్‌ టాప్‌

ఈనాడు, దిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది. ఇందులో నగదు (రూ.849.15 కోట్లు), మద్యం (రూ.814.85 కోట్లు), మాదకద్రవ్యాలు (రూ.3,958.85 కోట్లు), విలువైన లోహాలు (రూ.1,260.33 కోట్లు), ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన ఉచితాలు (రూ.2,006 కోట్లు) ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. జిల్లాల్లోని పరిస్థితులను నిరంతరంగా సమీక్షించడం, నిఘా సంస్థలు అందించిన సమాచారాన్ని క్రోడీకరించడం, వివిధ ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయడం వల్ల భారీ స్థాయిలో సొత్తు స్వాధీనం చేసుకోగలిగినట్లు ఈసీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల్లో మోహరించిన 656 వ్యయ పరిశీలకులతోపాటు, మరో 125 మంది పరిశీలకులు చెక్‌పోస్ట్‌లపై ప్రత్యేక నిఘాపెట్టి వీటిని పట్టుకున్నట్లు పేర్కొంది.  సార్వత్రిక ఎన్నికల సంవత్సరంలో జనవరి నుంచే విభిన్న దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేయడంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.6,760 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోగలిగినట్లు తెలిపింది. మార్చి 1 నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తులో 45% (రూ.3,958 కోట్లు) డ్రగ్స్‌ ఉన్నట్లు పేర్కొంది. పట్టుబడిన మొత్తం సొత్తులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రూ.301.75 కోట్లు, తెలంగాణ నుంచి రూ.333.55 కోట్లు ఉన్నట్లు తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో...

దేశవ్యాప్తంగా అత్యధిక సొత్తు దొరికిన రాష్ట్రాల్లో తెలంగాణ 10, ఏపీ 12వ స్థానంలో నిలిచాయి. ఏపీలో రూ.85.32 కోట్ల నగదు, రూ.43.17 కోట్ల విలువైన మద్యం, రూ.5.70 కోట్ల డ్రగ్స్, రూ.142.56 కోట్ల విలువైన నగలు, పంపిణీకి సిద్ధం చేసిన రూ.25.01 కోట్ల విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 తెలంగాణలో రూ.114.41 కోట్ల నగదు, రూ.76.26 కోట్ల విలువైన మద్యం, రూ.29.31 కోట్ల డ్రగ్స్, రూ.77.23 కోట్ల నగలు, రూ.36.34 కోట్ల విలువైన ఉచితాలు దొరికాయి. అత్యధిక నగదు తెలంగాణ (రూ.114.41 కోట్లు)లో, అత్యధిక డ్రగ్స్‌ గుజరాత్‌ (రూ.1,187 కోట్లు)లో పట్టుబడ్డాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు