పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు

మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్‌ అధిపతి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు.

Published : 19 May 2024 03:27 IST

హింసకు కారణమైన ఏ ఒక్కరినీ వదలబోం
సిట్‌ అధిపతి తెలిపారన్న తెదేపా నేతలు

సిట్‌ అధిపతి వినీత్‌ బ్రిజ్‌లాల్‌కు ఫిర్యాదు ప్రతిని అందజేస్తున్న వర్ల రామయ్య, మన్నవ సుబ్బారావు, కోడూరి అఖిల్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్‌ అధిపతి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. ఇప్పటికే సిట్‌ బృందాలు మాచర్ల, తాడిపత్రి సహా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న అన్ని ప్రాంతాలకు వెళ్లినట్టు వివరించారని అన్నారు. తానూ క్షేత్రస్థాయికి వెళుతున్నట్టు చెప్పారని వెల్లడించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను తెదేపా నేతలు వర్ల రామయ్య, మన్నవ సుబ్బారావు, కోడూరి అఖిల్‌ శనివారం కలిశారు. సిట్‌ బృందంలో ఎక్కువ మంది పూర్వ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి నేతృత్వంలో పనిచేసిన ఏసీబీ అధికారులే ఉండటంతో నిష్పాక్షిక విచారణపై వారు వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ముందు అనుమానాలు లేవనెత్తారు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా రాజేంద్రనాథరెడ్డి కొనసాగుతున్న అంశాన్ని ప్రస్తావించారు. స్పందించిన వినీత్‌ బ్రిజ్‌లాల్‌.. అలాంటిదేమీ ఉండబోదని, పార్టీలకతీతంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారని వెల్లడించారు. మాచర్ల, నరసరావుపేట, అనంతపురం, తిరుపతి, తాడిపత్రి సహా రాష్ట్రవ్యాప్తంగా 30 చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన ఆధారాలు, వీడియోల్ని తెదేపా నేతలు ఆయనకు అందజేశారు. అనంతరం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడారు. ‘పోలింగ్‌ సమయంలో, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల్లో పూర్వ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, పూర్వ నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కొల్లు రఘురామిరెడ్డి హస్తం ఉంది. వారి కాల్‌ రికార్డులు బయటకు తీస్తే వాస్తవాలు బయటకొస్తాయి’ అని పేర్కొన్నారు.

పెద్దారెడ్డి, చెవిరెడ్డి, మోహిత్‌రెడ్డిలను అరెస్టు చేయాలి: ‘తాడిపత్రిలో అరాచకం సృష్టించిన వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, తిరుపతిలో పులివర్తి నానిపై హత్యాయత్నం చేసిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్‌రెడ్డిలను అరెస్టు చేయాలి. పల్నాడులో పెద్ద ఎత్తున పెట్రోలు, నాటుబాంబులు దొరికాయి. వీటిని ఎందుకు, ఎవరు తెచ్చారో తేల్చాలి. ఈసీ తప్పు చేసిందని సీఎం జగన్‌ అంటున్నారు. గత ఎన్నికల సమయంలో సీఎస్‌ సహా ఉన్నతాధికారులను బదిలీ చేసినప్పుడు ఈసీ బాగా పనిచేసిందని ఆయనే కితాబిచ్చారు. ఇప్పుడు ఓడిపోతున్నామనే భయంతోనే బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని వర్ల పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని