ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్‌ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది.

Published : 19 May 2024 07:18 IST

దిల్లీ: ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. తప్పు చేసిన వ్యక్తులు ఉన్నత పదవుల్లో ఉన్నవారైనా సరే ధైర్యంగా చర్యలు తీసుకునే డీఎన్‌ఏ ప్రస్తుత ఈసీలో లేదంటూ విమర్శించింది. ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్‌లు అయోధ్య రామాలయాన్ని బుల్డోజ్‌ చేస్తాయ’ంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనగా పరిగణించాలని కోరుతూ తాము ఫిర్యాదు చేశామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. అంతకుముందు కూడా ప్రధాని మోదీ...‘ఎస్పీ, కాంగ్రెస్‌లు అయోధ్య రాముడిని మళ్లీ టెంట్‌లోకి పంపిస్తాయి. ఆలయంపైకి బుల్డోజర్లు పంపిస్తాయ’ని ఆరోపించారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ ప్రసంగాలు తరచూ సమాజంలోని సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసేలా ఉంటున్నాయంటూ వీడియో, పత్రికల క్లిప్పులను పంపించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకూ ఈసీ ఉపక్రమించలేదని ఏచూరి పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తామని చెబుతున్న ఈసీ... ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని సీతారాం ఏచూరి మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని