మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌కుమార్‌

మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి మేడ్చల్‌ పరిసరాలలోని ఆస్తులపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరతామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు.

Updated : 20 May 2024 11:05 IST

పేట్‌బషీరాబాద్, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి మేడ్చల్‌ పరిసరాలలోని ఆస్తులపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరతామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. హైదరాబాద్‌ కొంపల్లిలోని హోటల్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌ జీడిమెట్ల డివిజన్‌ పరిధి సుచిత్ర కూడలి సమీపంలోని సర్వే నంబరు 82లో తొమ్మిది మందిమి కలిసి స్థలం కొన్నాం. అందులో నాతోపాటు ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి కూడా ఉన్నారు. నా భూమిని 2021లో శ్రీనివాస్‌రెడ్డికి విక్రయించా. అయినా మల్లారెడ్డి ఇప్పుడు నా పేరు ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయిస్తా’’ అని వివరించారు.

వివాద స్థలంలో సర్వే: ఈ వివాద స్థలంలో ఆదివారం కుత్బుల్లాపూర్‌ రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిల అనుచరులకు.. శ్రీనివాస్‌రెడ్డి అనుచరులకు మధ్య శనివారం ఘర్షణ వాతావరణం నెలకొని ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. పోలీసుల సూచన మేరకు సర్వే ప్రారంభించారు. సర్వే చేస్తున్న ప్రాంతానికి ఇరు వర్గాల అనుచరులను, మీడియాను పోలీసులు అనుమతించలేదు. ఆ రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. సర్వే పూర్తయిన అనంతరం రెవెన్యూ అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని