సంక్షిప్త వార్తలు

రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరుగుతున్న బదిలీలు.. వివక్షపూరితంగా జరుగుతున్నాయని లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 20 May 2024 05:14 IST

బదిలీల్లో ఎస్సీ, ఎస్టీ అధికారులే బలవుతున్నారు

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరుగుతున్న బదిలీలు.. వివక్షపూరితంగా జరుగుతున్నాయని లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా.. దానికి ఎస్సీ, ఎస్టీ అధికారులే బలవుతున్నారని ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ‘పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ను మార్చడానికి కారణాలేంటో చెప్పాలి. మార్చిలో ఎన్నికల కమిషన్‌ బదిలీ చేసిన నలుగురిలో ముగ్గురు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కలెక్టర్లే ఉన్నారు. శివశంకర్‌ను తిరిగి పల్నాడులో కొనసాగించాలి’ అని ఆయన డిమాండు చేశారు.


సిట్‌తో ఒరిగేదేమీ లేదు: నారాయణ

గుంటూరు (నెహ్రూనగర్‌) న్యూస్‌టుడే: ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘర్షణలకు పూర్తి బాధ్యత వైకాపా పాలకులదే అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఓడిపోతామనే భయంతోనే వైకాపా నేతలు దాడులకు పాల్పడ్డారన్నారు. దాడులను నియంత్రించడంలో నిఘా, పోలీసు విభాగాలు, ఎన్నికల కమిషన్‌ విఫలమయ్యాయని.. దీని కోసం నియమించిన సిట్‌తో ఒరిగేదేమీ లేదన్నారు. దేశం, రాష్ట్రంలో రాజకీయ మార్పు తథ్యమని.. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న ఆయా ప్రభుత్వాలు గద్దెదిగడం ఖాయమన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.


సీఎంను కలిసిన కడియం కుటుంబసభ్యులు

వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వారి కుటుంబ సభ్యులు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. చిత్రంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు.      -

 ఈనాడు, హైదరాబాద్‌ 


దిల్లీ మద్యం కేసులో దోషులు తప్పించుకోలేరు

భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసు నుంచి దోషులెవరూ తప్పించుకోలేరని భాజపా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ పేర్కొన్నారు. ఆయన ఆదివారం దిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. ‘‘కొంత మంది వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చడానికే దిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారు. ఆధారాలు లేకుండా కవితను అరెస్ట్‌ చేశారన్న భారాస తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నా’’ అని ప్రభాకర్‌ పేర్కొన్నారు. 


దేశంలో ఉగ్రవాదాన్ని పెంచిన 370 అధికరణం 

జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్ని కాంగ్రెస్‌ పార్టీ 70 ఏళ్లపాటు కాపాడుతూ రావడంతోనే దేశంలో ఉగ్రవాదం పెరిగింది. మోదీని ప్రజలు రెండోసారి ప్రధానిని చేయగానే ఆయన ఈ అధికరణాన్ని రద్దుచేశారు. ఒకసారి జరిగిన విభజన చాలదన్నట్లు దేశాన్ని ఉత్తరాది, దక్షిణాదిగా విభజించాలని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. దీనిని భాజపా ఎప్పటికీ అనుమతించదు.   

 యూపీలోని జౌన్‌పుర్, ప్రయాగ్‌రాజ్‌ సభల్లో కేంద్రమంత్రి అమిత్‌షా 


370 రద్దును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు 

370 అధికరణం రద్దును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మా సభలకు లభిస్తున్న స్పందనే దానికి నిదర్శనం. 2018 నుంచి ప్రజా ప్రభుత్వం లేక సమస్యలన్నీ అపరిష్కృతంగా ఉన్నాయి. కశ్మీర్‌కు ఇచ్చిన ఏ హామీనీ భాజపా నెరవేర్చలేకపోయింది. మా పార్టీని దెబ్బతీయడం లక్ష్యంగా ఇప్పుడు ఇక్కడ జోడుగుర్రాలపై స్వారీ చేస్తోంది. 

 పీటీఐ ఇంటర్వ్యూలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా 


కాంగ్రెస్‌ ప్రధానులు పేదరికాన్ని నిర్మూలించలేకపోయారు

ప్రధానులుగా ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, మన్మోహన్‌సింగ్‌లలో ఎవరూ దేశంలో పేదరికాన్ని నిర్మూలించలేకపోయారు. అంతమంది విఫలమైన పనిని మోదీ చేసి చూపించారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చారు. రామ్‌లల్లా తన ఆలయానికి చేరుకోవడంతో దేశంలో రామరాజ్యం నెలకొంది.

 ఒడిశాలోని సంబల్‌పుర్‌లో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌  


మతం ఆధారంగా మేం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదు 

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కొన్ని మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చినా అది మత ప్రాతిపదికన కాదు. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగానే వాటిని ఇచ్చాం. మతం ఆధారంగా రిజర్వేషన్లు, పౌరసత్వం ఇవ్వకూడదన్న రాజ్యాంగానికి మేమంతా కట్టుబడి ఉన్నాం. భాజపా మాత్రం మత ప్రాతిపదికన పౌరసత్వం ఇస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. 

పట్నాలో విలేకరుల సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ 


నిరుద్యోగుల్లో 83% మంది యువతే 

ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీల్లో అనేకం నెరవేరలేదు. దేశంలో నిరుద్యోగుల్లో 83% మంది యువతే. విద్యావంతులైన యువతీయువకుల్లో మూడింట రెండొంతుల మందికి ఉద్యోగాల్లేవు. స్కిల్‌ ఇండియా పథకం విఫలమైంది. ప్రతిరోజూ 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పదేళ్లలో దేశం అప్పు రెట్టింపు అయింది.  

 కోల్‌కతాలో మీడియాతో తృణమూల్‌ సీనియర్‌ నేత అమిత్‌ మిత్రా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు