‘కళింగ’ కదన కుతూహలం!

నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న కళింగ గడ్డ ఒడిశాలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. నేడు 5 లోక్‌సభ సీట్లు, 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్‌ జరగనుంది.

Published : 20 May 2024 03:52 IST

సీఎం నవీన్‌ పట్నాయక్‌కు భాజపా సవాల్‌
మధ్యలో ఇండియా కూటమి
5 లోక్‌సభ, 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేడే పోలింగ్‌
భువనేశ్వర్‌ - న్యూస్‌టుడే

నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న కళింగ గడ్డ ఒడిశాలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. నేడు 5 లోక్‌సభ సీట్లు, 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్‌ జరగనుంది. బిజూ జనతాదళ్‌ (బిజద) అధినేత, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ (అసెంబ్లీకి),  5 సార్లు ఎంపీగా గెలిచిన భాజపా నేత జుయెల్‌ ఓరం (లోక్‌సభకు) ఈ విడత బరిలో నిలిచారు. అస్కా, కంధమాల్, సుందర్‌గఢ్, బరగఢ్, బొలంగీర్‌ లోక్‌సభ స్థానాలకు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి బిజద, భాజపాల మధ్య తీవ్ర పోరు సాగుతుండగా ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 


ఇనుము, సున్నపురాయిల గని

ఒడిశా పశ్చిమ ప్రాంతంలో ఉన్న సుందర్‌గఢ్‌ నియోజకవర్గంలో ఇనుప, సున్నపురాయి, మాంగనీస్‌ గనులు అధికంగా ఉంటాయి. ఇనుము, ఎరువులు, సిమెంటు, గ్లాస్‌ వంటి కర్మాగారాలకు ప్రసిద్ధి. పాక్షిక పట్టణ ప్రాంతంగా ఉన్న ఈ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వు అయింది. గతంలో ఇక్కడ కాంగ్రెస్, భాజపా, జనతాదళ్‌ గెలిచాయి. బిజద ఒక్కసారీ గెలవలేదు. 

 2014, 2019లలో భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి జుయెల్‌ ఓరం ఇక్కడి నుంచి గెలిచారు. మరోసారి ఆయనే పోటీ చేస్తున్నారు. ఆయన పోటీ చేయడం ఇది ఆరోసారి. గతంలో పోటీ చేసిన ఐదుసార్లూ గెలిచారు. రాజ్యసభ మాజీ సభ్యుడు, హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ దిలీప్‌ తిర్కీ బిజద తరఫున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి జనార్దన్‌ దెహురి బరిలో ఉన్నారు. గతంలో కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచినా ఈసారి పోటీ భాజపా, బిజద మధ్యే సాగుతోంది.   


సాంస్కృతిక వారసత్వ కేంద్రం

ఒడిశాలోని బొలంగీర్‌ సాంస్కృతిక వారసత్వ కేంద్రం. దేశంలో ప్రముఖ పర్యాటక క్షేత్రం. ఈ నియోజకవర్గంలో అక్షరాస్యత 65.5 శాతం. 12శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారు. 98శాతం హిందువులే ఉంటారు. ఎస్సీలు 18%, ఎస్టీలు 21% ఉంటారు. 1998లో భాజపా ఇక్కడ ఖాతా తెరిచింది. రాజ కుటుంబానికి చెందిన సంగీత కుమారి సింగ్‌దేవ్‌ పలుమార్లు విజయం సాధించారు. ఇక్కడ నీటి కొరత, వలసలు, మావోయిస్టుల ప్రభావం ప్రధాన సమస్యలు. 

 2014లో బిజద, 2019లో భాజపా ఇక్కడ గెలిచాయి. ఈసారి రాణి, సిటింగ్‌ ఎంపీ సంగీత కుమారి సింగ్‌దేవ్‌ ఐదోసారి భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మాజీ మంత్రి సురేంద్ర సింగ్‌ భొయ్‌ బిజద అభ్యర్థి. ఒడియా సినీ నటుడు మనోజ్‌ మిశ్ర కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. తన ఓటు షేరును పెంచుకోవాలని భాజపా, 2014 విజయాన్ని పునరావృతం చేయాలని బిజద ప్రయత్నిస్తున్నాయి. సంగీత భారీగా ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల తర్వాత ఆమె నియోజకవర్గంలో కనిపించరనే విమర్శ ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఇద్దరి ఓట్లను చీల్చే అవకాశముంది.


తీర ప్రాంతం

ఒడిశా తీర ప్రాంత నియోజకవర్గం అస్కా. గంజాం జిల్లా దీని పరిధిలోకే వస్తుంది. అతి పురాతన సహకార చక్కెర కర్మాగారం ఈ ప్రాంతంలో ఉంది. ఇక్కడ గతంలో కాంగ్రెస్, సీపీఐ. జనతాదళ్‌ గెలిచాయి. నవీన్‌ పట్నాయక్‌ తండ్రి బిజూ పట్నాయక్‌ గతంలో ఇక్కడి నుంచి విజయం సాధించారు. నవీన్‌ పట్నాయక్‌ ఒకసారి గెలిచారు. 

 2014, 2019లలో అస్కా నుంచి బిజద విజయం సాధించింది. తనకు బాగా పట్టున్న ఈ నియోజకవర్గంలో ఈసారి భాజపా గట్టి పోటీ ఇస్తోంది. బిజద అభ్యర్థిగా రంజితా సాహు, భాజపా తరఫున అనితా శుభదర్శిని, కాంగ్రెస్‌ నుంచి దేబకాంత శర్మ బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం హింజిలి ఇందులోనే ఉంది. దీంతో బిజద తిరుగులేని విజయాలను సాధిస్తోంది. 


నక్సల్స్‌ ప్రభావితం

ఒడిశాలోని 15 నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల్లో బరగఢ్‌ ఒకటి. ఈ నియోజకవర్గంలో 82శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లోనే ఉంటారు. ఎస్సీలు 19.5%, ఎస్టీలు 22.2% ఉంటారు. రైతుల సమస్యలు, రైల్వే అనుసంధానత, ఉద్యోగావకాశాలు, రోడ్లు, అయోధ్య రామ మందిరం ఇక్కడ ప్రధానాంశాలు.

 2014లో బిజద, 2019లో భాజపా గెలిచాయి. ఈసారి భాజపా నుంచి కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు ప్రదీప్‌ పురోహిత్, బిజద తరఫున పరిణీత మిశ్ర, కాంగ్రెస్‌ నుంచి సంజయ్‌ భోయ్‌ తలపడుతున్నారు. మోదీ వేవ్‌పై భాజపా ఆధారపడుతోంది. 2019లో సాధించిన అనూహ్య విజయాన్ని పునరావృతం చేయాలని భాజపా భావిస్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విభిన్న తీర్పును ఇక్కడి ప్రజలు ఇస్తారు. ఈసారీ అసెంబ్లీకి బిజదకు, లోక్‌సభకు భాజపాకు మద్దతు పలికే పరిస్థితే కనిపిస్తోంది. 


పసుపు ఉత్పత్తికి ప్రసిద్ధి

దేశంలో అత్యధికంగా పసుపు ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో కంధమాల్‌ ఒకటి. దాదాపు 60,000 గిరిజన కుటుంబాలు ఈ పంటను సాగు చేస్తాయి. ఈ ప్రాంతంలో గిరిజనులు సాగుచేసే పసుపునకు జీఐ గుర్తింపూ వచ్చింది. గిరిజనుల ప్రాబల్యం అధికంగా ఉన్నా ఇది జనరల్‌ నియోజకవర్గంగానే ఉంది. బిజదకు కంచుకోటే అయినా భాజపా క్రమంగా బలం పుంజుకుంటోంది.

ఈ నియోజకవర్గం ఏర్పాటైన 2009 నుంచీ బిజద గెలుస్తూ వస్తోంది. ఈసారి బిజద నుంచి సిటింగ్‌ ఎంపీ అచ్యుత సామంత, భాజపా తరఫున ఆరెస్సెస్‌ కార్యకర్త, వివిధ సేవా సంస్థలతో కలిసి పనిచేసే సుకాంత కుమార్‌ పాణిగ్రాహి, కాంగ్రెస్‌ నుంచి అమిర్‌ చంద్‌ నాయక్‌ తలపడుతున్నారు. ప్రధాన పోటీ బిజద, భాజపాల మధ్యే ఉంది. కాంగ్రెస్‌ పోటీ నామమాత్రమే. సామంతకు ఈ ప్రాంతంలో మంచి పేరుంది. ఆయనవల్లే కంధమాల్‌కు నీతి ఆయోగ్‌ 9 ఆకాంక్షిత జిల్లాల్లో చోటు దక్కింది. విద్య, గిరిజనుల అభివృద్ధి, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి అంశాల్లో సామంత కృషి గణనీయంగా ఉంది. దీంతో గెలుపుపై బిజద ఆశలు పెట్టుకుంది. మోదీపైనే భాజపా ఆధారపడుతోంది. 


నవీన్‌కు వలసల తలనొప్పి

గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ రెండు చోట్లా పోటీ చేస్తున్నారు. అస్కా లోక్‌సభ పరిధిలోని హింజిలి నుంచి ఆరోసారి బరిలోకి దిగారు. బొలంగీర్‌ జిల్లాలోని కంటాబంజి నుంచీ పోటీ చేస్తున్నారు. 2019లో హింజిలి, బిజెపుర్‌ల నుంచి పోటీ చేసిన సీఎం రెండు చోట్లా గెలిచారు. బిజెపుర్‌ను వదులుకున్నారు.

దక్షిణాన ఉండే హింజిలి, పశ్చిమాన ఉండే కంటాబంజి మధ్య దాదాపు 350 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఈ రెండింటికి ఒక విషయంలో సారూప్యం ఉంది. అదే వలసల సమస్య. నిరుద్యోగం, మౌలిక వసతుల గురించి స్థానికులు మాట్లాడుతున్నా వలసలే ఇక్కడ అతి పెద్ద సమస్యగా ఉంది. రెండు ప్రాంతాల నుంచి దాదాపు లక్ష మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. ఎన్నికల నేపథ్యంలో వీరికి డిమాండు ఏర్పడింది. వారిని వెనక్కి రప్పించేందుకు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 

ఓటేయకపోతే ఉచిత బియ్యం, ఇతర ప్రభుత్వ పథకాలను ఇవ్వబోమని సర్పంచి బెదిరించారని, దీంతో సూరత్‌ నుంచి వచ్చామని సంతోష్‌ గౌడ అనే వలస కార్మికుడు తెలిపారు. రైలు టికెట్లతోపాటు భోజనానికి రూ.500 ఇచ్చారని వివరించారు. 24 ఏళ్లుగా పట్నాయక్‌ హింజిలి ఎమ్మెల్యేగా ఉంటున్నారు. చిన్న గ్రామంగా ఉన్న హింజిలిని ఆయన మున్సిపాలిటీ చేశారు. ప్రాంతీయ ఆసుపత్రి, గ్రామీణ పారిశ్రామిక పార్కు, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, అగ్నిమాపకశాఖ కార్యాలయం, సాగునీటి ప్రాజెక్టు, ఇంటింటికీ తాగునీటి సౌకర్యాలను ముఖ్యమంత్రి కల్పించారు. కానీ వలస సమస్యను పరిష్కరించలేకపోయారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా కూరగాయలను పండిస్తారు. వారికి కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యం లేదు. ఈసారి హింజిలిలో బిజద, భాజపా, కాంగ్రెస్‌తోపాటు 10 మంది పోటీ చేస్తున్నా ప్రధాన పోటీ బిజద, భాజపా మధ్యే ఉంది. ఇక్కడ 2.31 లక్షల మంది ఓటర్లున్నారు.  

 కంటాబంజిలోని ప్రజలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ఇటుక ఫ్యాక్టరీల్లో పని చేసేందుకు వలస వెళ్తుంటారు. ముఖ్యమంత్రి తమ నియోజకవర్గానికి రావడంతో అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నామని స్థానికులు అంటున్నారు.  


రవుర్కెలాలో ఇద్దరు యోధులు

ఉక్కు నగరం రవుర్కెలా అసెంబ్లీ స్థానంపై అందరి దృష్టి ఉంది. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి, పారిశ్రామిక వేత్త దిలీప్‌ రే భాజపా తరఫున బరిలో ఉన్నారు. కార్మికశాఖ మంత్రి శారదా ప్రసాద్‌ నాయక్‌ బిజద అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ ఉద్ధండులే. ఓటర్లు ఎవరి పక్షాన నిలుస్తారన్నది ఆసక్తికరం.

 గంజాం జిల్లా భంజనగర్‌లో ఆర్థికశాఖ మంత్రి బిక్రం కేసరి అరుఖ్, బొలంగీర్‌ జిల్లా టిట్లాగఢ్‌ స్థానంలో జల వనరులు, వాణిజ్య, రవాణాశాఖల మంత్రి టుకుని సాహు, బౌద్ధ్‌లో అటవీ, పర్యావరణశాఖల మంత్రి ప్రదీప్‌ అమత్, బరగఢ్‌ జిల్లా బిజెపుర్‌లో చేనేత, జౌళిశాఖ మంత్రి రీతా సాహు బిజద అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వారు భాజపా నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని