రాహుల్‌ నోట మావోయిస్టుల భాష.. వాళ్లొస్తే పెట్టుబడులు రావు

బలవంతపు ధన సమీకరణ వంటి కొత్త పద్ధతుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్‌ యువరాజు (రాహుల్‌గాంధీని ఉద్దేశించి) మావోయిస్టుల భాష వింటే ఆ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఒకటికి యాభైసార్లు ఆలోచిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు.

Updated : 20 May 2024 06:37 IST

జంశెద్‌పుర్‌ (ఝార్ఖండ్‌)/మేదినీపుర్‌ (పశ్చిమబెంగాల్‌): బలవంతపు ధన సమీకరణ వంటి కొత్త పద్ధతుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్‌ యువరాజు (రాహుల్‌గాంధీని ఉద్దేశించి) మావోయిస్టుల భాష వింటే ఆ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఒకటికి యాభైసార్లు ఆలోచిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతున్న ఈ పారిశ్రామిక వ్యతిరేక భాష మీకు సమ్మతమేనా? అని ‘ఇండియా’ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రశ్నించారు. ఝార్ఖండ్‌లోని జంశెద్‌పుర్‌.. పశ్చిమబెంగాల్‌లోని పురూలియా, విష్ణుపుర్, మేదినీపుర్‌ ఎన్నికల సభల్లో ఆదివారం మోదీ మాట్లాడారు. తాను నక్సలైట్ల వెన్నెముక విరవడంతో కాంగ్రెస్‌ - జేఎంఎం ‘నిధుల దోపిడీ’ బాధ్యత తీసుకున్నాయని ఆరోపించారు. యూపీలోని రాయ్‌బరేలీ నుంచి పోటీకి దిగిన రాహుల్‌గాంధీ ‘‘ఇది మా మమ్మీ స్థానం’’ అని చెబుతున్నారని, 8వ తరగతి పిల్లాడు కూడా అలా మాట్లాడడని ఎద్దేవా చేశారు. కుమారుడి కోసం ఓట్లు అడుగుతున్న  సోనియాగాంధీపైనా మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘కొవిడ్‌ తర్వాత ఆమె రాయ్‌బరేలీని ఒక్కసారి కూడా సందర్శించలేదు. ఇపుడు కుమారుణ్ని రాయ్‌బరేలీ ప్రజల చేతుల్లో పెడుతున్నానని అంటున్నారు. అక్కడ పోటీలో దింపడానికి ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌ అభివృద్ధి కోసం పనిచేసిన ఒక్క కార్యకర్త కూడా మీకు కనిపించలేదా?’’ అని నిలదీశారు. వారసత్వ రాజకీయాలు చేస్తున్న గాంధీ కుటుంబం లోక్‌సభ స్థానాలను తమ పూర్వీకుల ఆస్తులుగా పరిగణించి వీలునామా రాస్తోందని ప్రధాని మండిపడ్డారు.  

మర్యాద హద్దులు దాటిన మమత

ఇస్కాన్, రామకృష్ణ మిషన్, భారత్‌ సేవాశ్రమ్‌ సంఘ వంటి సామాజిక, ఆధ్యాత్మిక సేవాసంస్థల సాధువులపై అసత్య ప్రచారాలు చేయడం ద్వారా పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారు మర్యాదకున్న అన్ని హద్దులు దాటిందని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. ముస్లిం అతివాదుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగానే ఈ సంస్థలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని ఓటుబ్యాంకు రాజకీయాల్లో భాగంగా బెంగాల్‌ సీఎం బహిరంగ వేదికల నుంచి దుర్భాషలాడుతున్నట్లు తెలిపారు. పశ్చిమబెంగాల్‌లోని పురూలియా, విష్ణుపుర్, మేదినీపుర్‌ సభల్లో ప్రధాని మాట్లాడారు. టీఎంసీ కథ ముగిసిందన్న వాస్తవం గ్రహించిన ఆ పార్టీ నేతలు ఈ ఒత్తిడిలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది అనుచరులున్న ఇస్కాన్‌ వంటి సంస్థలను బెదిరించి హిందూ సమాజం మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నట్లు తెలిపారు. చొరబాటుదారులు బెంగాల్‌కు ప్రమాదకరమని హెచ్చరించిన ప్రధాని.. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తున్న మమత సర్కారు చొరబాటుదారులకు స్వాగతం పలకడం విడ్డూరమన్నారు. 


ఒడిశా చేరుకున్న ప్రధాని

భువనేశ్వర్‌: ఒడిశాలో రెండు రోజుల ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఈ రాష్ట్రంలోని పార్టీ నేతలతో సమావేశ నిమిత్తం భువనేశ్వర్‌లోని భాజపా ప్రధాన కార్యాలయానికి ప్రధాని వెళ్లారు. రోడ్డుకు ఇరువైపులా గుమికూడిన జనం మోదీకి అభివాదం చేస్తూ చేతులూపారు. సమావేశం అనంతరం రాజ్‌భవన్‌లో బస చేసి, సోమవారం ఉదయం పూరీ జగన్నాథుడి దర్శనంతో కార్యక్రమాలను ప్రధాని ప్రారంభిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని