సుస్థిర విధానాలతో సుసంపన్న భారత్‌

ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే దేశ ఆర్థిక రంగం ఒడుదొడుకులకు గురవుతుందని, స్టాక్‌ మార్కెట్లు పతనమవుతాయంటూ భాజపా నేతలు మదుపరుల్లో భయాందోళనలు రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ధ్వజమెత్తారు.

Published : 20 May 2024 03:56 IST

స్టాక్‌ మార్కెట్‌ ఒడుదొడుకులపై ఆందోళనలు వద్దు: జైరాం రమేశ్‌

దిల్లీ: ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే దేశ ఆర్థిక రంగం ఒడుదొడుకులకు గురవుతుందని, స్టాక్‌ మార్కెట్లు పతనమవుతాయంటూ భాజపా నేతలు మదుపరుల్లో భయాందోళనలు రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ధ్వజమెత్తారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సుస్థిర విధానాలతో దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. హోంమంత్రి అమిత్‌ షా ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ ఆయన ప్రకటన విడుదల చేశారు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో అనుసరించిన పక్షపాత వైఖరి, వేధింపుల వల్లే మన దేశం నుంచి అనేక ప్రైవేటు పెట్టుబడులు తరలిపోయాయని రమేశ్‌ ఆరోపించారు. కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్టీ భారం, ఆకస్మిక లాక్‌డౌన్, దేశంలోని కొద్ది మంది పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం వంటి మోదీ ప్రభుత్వ తప్పిదాలు ఆర్థికాభివృద్ధిని దెబ్బతీశాయని పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక రంగం అభివృద్ధితో పాటు పెట్టుబడులు భారీగా తరలివచ్చాయని వివరించారు. మోదీ సర్కారు వల్ల పారిశ్రామికవేత్తల్లో, పెట్టుబడిదారుల్లో ఏర్పడిన అపనమ్మకాన్ని ఇండియా కూటమి ప్రభుత్వం తొలగిస్తుందని, చట్టబద్దమైన పాలనతో అందరి విశ్వాసాన్ని పొందుతుందని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని