పెద్దలను మోదీ అలా అనొచ్చా!

లోక్‌సభ ఎన్నికల తరవాత విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, అందులోని మిత్రపక్షమైన ఆప్‌ దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాకు యత్నిస్తుందని భాజపా ఆందోళనలో ఉందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Updated : 20 May 2024 06:35 IST

పవార్‌పై ప్రధాని వ్యాఖ్యలను ఉద్దేశించి కేజ్రీవాల్‌ నిలదీత

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల తరవాత విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, అందులోని మిత్రపక్షమైన ఆప్‌ దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాకు యత్నిస్తుందని భాజపా ఆందోళనలో ఉందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. దక్షిణ దిల్లీ లోక్‌సభ అభ్యర్థి సాహి రామ్‌ పహల్వాన్‌ తరఫున ఆయన ఆదివారం కాల్‌కాజిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తున్నారు. శరద్‌ పవార్‌ను సంచార ఆత్మగా అభివర్ణించారు. ఉద్ధవ్‌ ఠాక్రేను ఆయన తండ్రికి నిజమైన సంతానం కాదని అన్నారు. మోదీకి 74 ఏళ్లు, శరద్‌ పవార్‌కు 84 సంవత్సరాలు. పెద్దవారి పట్ల ప్రధాని అలా మాట్లాడొచ్చా. జూన్‌ 4న ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోంది. ఆప్‌ ప్రభుత్వంలో భాగం కానుంది. మేం దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా తీసుకొస్తాం. నగరంలో మంచి పాఠశాలలు, ఆసుపత్రులున్నాయి. కానీ శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉంది’’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. అంబేడ్కర్‌ నగర్‌లో జరిగిన మరో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘‘గడచిన కొద్ది రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించాను. నిరుద్యోగంతో ప్రజలు విసుగు చెందారు. కానీ ఎవరిని జైలుకు పంపాలా అని ప్రధాని మోదీ ఆలోచిస్తుంటారు. వారు ఆప్‌ నేతలందరినీ అరెస్టు చేస్తారు. మనం ప్రధానిని ఎన్నుకున్నామా? లేక పోలీసు అధికారిని ఎన్నుకున్నామా?’’ అని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని