పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెల్లో పోలింగ్‌ ముగిసిన తర్వాత జరిగిన ఘర్షణలో.. అక్కడ లేనివారిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని బాధితుడు మురళీధర్‌ వాపోయారు.

Published : 20 May 2024 04:19 IST

తిరుపతిలో ఎన్నికల అనంతర ఘర్షణలపై  బాధితుల ఆందోళన
పోలింగ్‌ రోజు వైకాపా మూకల దాడి
వీడియోల విడుదల

వైకాపా శ్రేణుల దాడి వీడియోను చూపిస్తున్న బాధితుడు మురళీధర్‌

ఈనాడు, తిరుపతి: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెల్లో పోలింగ్‌ ముగిసిన తర్వాత జరిగిన ఘర్షణలో.. అక్కడ లేనివారిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని బాధితుడు మురళీధర్‌ వాపోయారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలను ఆదివారం ఆయన మీడియాకు విడుదల చేశారు. ‘పోలింగ్‌ రోజు నేను రామిరెడ్డిపల్లెలో తెదేపా ఏజెంట్‌గా కూర్చొన్నా. రాత్రి 7.54కు పోలింగ్‌ పూర్తయింది. 8.44కు పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు రాగానే వైకాపా నేత కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, అతని అనుచరులు దాడి చేశారు. అక్కడి నుంచి ఎలాగోలా బయటపడి స్వగ్రామమైన కూచివారిపల్లెకు 9.06 గంటలకు చేరుకున్నా. చంద్రశేఖర్‌రెడ్డి అనుచరులు మరోసారి కూచివారిపల్లెకు వచ్చి రాళ్లు, కర్రలతో కొట్టారు. 12మంది తెదేపా సానుభూతిపరులకు గాయాలయ్యాయి. ఆత్మరక్షణ కోసం గ్రామస్థులు ఎదురుదాడికి దిగడంతో వాళ్లు పారిపోయారు. విషయం తెలుసుకున్న చంద్రగిరి వైకాపా అభ్యర్థి మోహిత్‌రెడ్డి, ఆయన సోదరుడు హర్షిత్‌రెడ్డి.. కర్రలు తీసుకొని 9.12 గంటలకు గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే మాకు గాయాలు కావడంతో నారావారిపల్లెలోని ఆసుపత్రికి వెళ్లాం. చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి మేం నిప్పు పెట్టలేదు. పూర్తి ఆధారాలను సిట్‌కు అందిస్తాం. పోలీసులు కావాలని గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులపైనా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు’ అని మురళీధర్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని