అప్పుడు లేని లేఖ.. ఇప్పుడెలా వచ్చింది?: తెదేపా

విజయనగరం తహసీల్దారు కార్యాలయం నుంచి పోస్టల్‌ బ్యాలట్‌ తరలింపుపై ఇంకా ఆందోళన సాగుతోంది. తాజాగా ఏఆర్వో, తహసీల్దారు రత్నం విడుదల చేసిన లేఖ చర్చనీయాంశంగా మారింది.

Published : 20 May 2024 04:20 IST

మాట్లాడుతున్న అదితి. చిత్రంలో ఎంపీ అభ్యర్థి అప్పలనాయుడు

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: విజయనగరం తహసీల్దారు కార్యాలయం నుంచి పోస్టల్‌ బ్యాలట్‌ తరలింపుపై ఇంకా ఆందోళన సాగుతోంది. తాజాగా ఏఆర్వో, తహసీల్దారు రత్నం విడుదల చేసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. దానిపై తెదేపా విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు, ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 16న తహసీల్దారు కార్యాలయంలోని స్ట్రాంగ్‌రూమ్‌ నుంచి అక్రమంగా ఎంపీ అభ్యర్థికి సంబంధించిన పోస్టల్‌ బ్యాలట్‌ పెట్టెలను తరలించారని ఆరోపించారు. దీనిపై వైకాపా నాయకులకు తప్ప తమకు, ఇతర అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు సమాచారం ఇవ్వలేదన్నారు. వైకాపా నుంచి అభ్యర్థి, ఏజెంట్లు కాకుండా ఎమ్మెల్యే, ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అల్లుడు ఈశ్వర్‌ కౌశిక్, విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు హాజరుకావడం విడ్డూరంగా ఉందన్నారు. వారి ఆధ్వర్యంలో స్ట్రాంగ్‌రూమ్‌ తెరిచారని చెప్పారు. ఎమ్మెల్యే వీరభద్రస్వామి లేఖ ఇవ్వడంతోనే ఈశ్వర్‌ కౌశిక్, ఎంపీపీని అనుమతించామని ఏఆర్వో లేఖ చూపిస్తున్నారని, ఇంతవరకూ లేని లేఖ.. ఇప్పుడెలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ చర్యలన్నీ తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని