పోలీసులే.. నేరస్థులు: అంబటి రాంబాబు

ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో తలలు పగులుతుంటే పోలీసులు స్పందించకుండా అలసత్వం వహించారని, అసలు నేరస్థులు పోలీసులేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.

Updated : 20 May 2024 06:18 IST

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో తలలు పగులుతుంటే పోలీసులు స్పందించకుండా అలసత్వం వహించారని, అసలు నేరస్థులు పోలీసులేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైకాపా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఈవీఎంలు పగలగొట్టడం, హింసాత్మక ఘటనలకు పాల్పడటం వంటివి జరిగాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫిర్యాదు మేరకు పల్నాడు జిల్లాలో, ఇతర ప్రాంతాల్లోనూ అధికారులను మార్చారు. ఎస్పీలను మార్చినచోటే హింస చెలరేగింది. ఈ స్థాయిలో హింస గతంలో ఏనాడూ జరగలేదు. పల్నాడులో జరిగిన హింసకు పురందేశ్వరి, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లే ప్రధాన కారణం’ అని ఆరోపించారు. ‘తొండపి గ్రామంలో శాంతిభద్రతలు పునరుద్ధరించాలి. భయపడి గ్రామం వదిలి తలదాచుకున్న వైకాపా కార్యకర్తలకు నేను అండగా ఉంటా. పోలీసులే తప్పుడు కేసులు పెట్టి బాధితులను బెదిరిస్తున్నారు. నార్నెపాడు ఘటనపై సత్తెనపల్లి రూరల్‌ సీఐ రాంబాబు కౌంటర్‌ కేసులు వేయించి, తప్పుడు కేసులను ప్రోత్సహిస్తున్నారు. సిట్ అధికారులకు ఆయనపై ఫిర్యాదు చేశాం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని