ఆమ్‌ఆద్మీ పార్టీ అంతానికి ‘ఆపరేషన్‌ ఝాడూ’

ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)ని ముప్పుగా భావిస్తున్న భాజపా తమ పార్టీని అణచేసేందుకు ‘ఆపరేషన్‌ ఝాడూ’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ఆరోపించారు.

Updated : 20 May 2024 06:32 IST

మోదీపై కేజ్రీవాల్‌ ఆరోపణ
సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు పిలుపు
భాజపా కార్యాలయ ముట్టడిని నిలువరించిన పోలీసులు

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)ని ముప్పుగా భావిస్తున్న భాజపా తమ పార్టీని అణచేసేందుకు ‘ఆపరేషన్‌ ఝాడూ’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ఆరోపించారు. సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ అరెస్టుకు నిరసనగా భాజపా ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు పార్టీ కార్యకర్తలు, నేతలతో బయలుదేరిన వేళ కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆప్‌ ఎదుగుదలపై ప్రధాని ఆందోళనతో ఉన్నారు. మన పార్టీ చాలా వేగంగా ఎదుగుతోంది. ఆప్‌ను అంతం చేసేందుకు ఆయన ‘ఆపరేషన్‌ ఝాడూ(చీపురు)’ను ప్రారంభించారు. వచ్చే కొద్ది రోజుల్లో మన బ్యాంకు ఖాతాలనూ స్తంభింపజేస్తారు. మన పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటారు. మనల్ని రోడ్లపైకి తీసుకొస్తారు. మున్ముందు మరిన్ని పెద్ద సవాళ్లు ఎదురుకావచ్చు. వాటిని ఎదుర్కొనేందుకు పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలి. గతంలో మనమంతా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనకు హనుమంతుడి ఆశీస్సులున్నాయి. ఆ సవాళ్లను ఎదుర్కోవలసిందే. సత్యమార్గంలో ప్రయాణించాలి. సమాజం కోసం మనం పని చేయాలి. మమ్మల్ని అందరిని జైలుకు పంపి ఆప్‌ అంతమవుతుందో లేక ఇంకా ఎదుగుతుందో మీరు గమనించొచ్చు. తిహాడ్‌ జైల్లో ఉన్నప్పుడు భగవద్గీత రెండు సార్లు, రామాయణం ఒకసారి చదివా’’అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. అనంతరం భాజపా కార్యాలయాన్ని ముట్టడించేందుకు కేజ్రీవాల్‌ తన పార్టీ నేతలు, కార్యకర్తలతో సహా బయలుదేరారు. వారిని పోలీసులు దారిలోనే అడ్డుకున్నారు. దీంతో కేజ్రీవాల్‌ అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. ఫలితంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆప్‌ విడుదల చేసిన ప్రకటనలో ‘‘భాజపా ప్రధాన కార్యాలయానికి శాంతియుతంగా బయలుదేరినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. వారు అరెస్టు చేస్తారేమోనని అక్కడే అరగంట వేచి చూశాం. అయితే భాజపా తన ఓటమిని అంగీకరించింది’’ అని పేర్కొంది. ఆప్‌ ఆందోళన నేపథ్యంలో డీడీయూ మార్గ్‌లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. ఐటీవో మెట్రో స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. భాజపా కేంద్ర కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు