ఎవరొస్తారో రండ్రా.. అంటూ బోరుగడ్డ అనిల్‌ వీరంగం!

వైకాపా నాయకుడిగా చలామణి అవుతున్న బోరుగడ్డ అనిల్, తన అనుయాయులతో కలిసి కర్రలు పట్టుకుని సోమవారం రాత్రి గుంటూరు వేళాంగిణినగర్‌లో హల్‌చల్‌ చేశారు.

Published : 21 May 2024 06:22 IST

తెదేపా కార్యకర్త ఇంటిపైకి కర్రలతో అనుయాయులు
గుంటూరు నగరంలో కొద్దిసేపు ఉద్రిక్తత

వేళాంగిణినగర్‌లో బోరుగడ్డ అనిల్‌తో మాట్లాడుతున్న ఎస్సై  

ఈనాడు, అమరావతి: వైకాపా నాయకుడిగా చలామణి అవుతున్న బోరుగడ్డ అనిల్, తన అనుయాయులతో కలిసి కర్రలు పట్టుకుని సోమవారం రాత్రి గుంటూరు వేళాంగిణినగర్‌లో హల్‌చల్‌ చేశారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. వేళాంగిణినగర్‌లో బోరుగడ్డ అనిల్‌ ఇల్లు ఉంది. ఆయన ఇంటిమీదుగా ఆ ప్రాంతానికే చెందిన తెదేపా కార్యకర్త బెజ్జం అనిల్, మరికొందరు నడిచి వెళ్తున్నారు. వారిని ఉద్దేశించి అనిల్‌ ఇంటివద్ద ఉండే ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది మీరెవరు.. కొత్తగా ఉన్నారు, ఇటుగా ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ‘మేం స్థానికులం. మాకు ఇక్కడ సొంతిళ్లు ఉన్నాయి. మమ్మల్నే అనుమానిస్తారా’ అంటూ వారు గట్టిగా మాట్లాడడంతో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. స్థానిక యువకులు తమపై దాడిచేసినట్లు బోరుగడ్డ అనిల్‌కు భద్రతా సిబ్బంది ఫోన్‌ చేసి చెప్పడంతో వెంటనే ఆయన మూడు వాహనాల్లో కొందరిని తీసుకుని అక్కడకు చేరుకున్నారు.

ఎవరొస్తారో రండి చూస్తామంటూ రహదారిపై హంగామా సృష్టించారు. ఎవడ్రా మా సిబ్బందిని కొట్టిందంటూ తెదేపా కార్యకర్త బెజ్జం అనిల్‌ ఇంటిపైకి దూసుకెళ్లారు. ఆ సమయంలో అనిల్‌ ఇంట్లో లేరు. అనిల్‌ ఎక్కడున్నారంటూ తల్లిదండ్రులను ప్రశ్నించారు. ఇంట్లో లేరని, ఎక్కడికి వెళ్లారో తెలియదని వారు సమాధానమిచ్చారు. ఈ విషయం తెలిసిన బెజ్జం అనిల్‌ అప్పటికప్పుడు కొంతమంది యువకులతో తన ఇంటికి చేరుకున్నారు. ఇంతలో తెదేపా మాజీ కార్పొరేటర్, క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ మద్దిరాల మ్యానీ అక్కడకు చేరుకుని, గొడవలు లేకుండా నివారించారు. అనంతరం అరండల్‌పేట ఎస్సై నాగరాజు అక్కడే ఉన్న బోరుగడ్డ అనిల్‌తో పాటు వారి అనుయాయులను అక్కడినుంచి పంపేశారు. ఇరువర్గాల మధ్య కొద్దిపాటి గొడవ జరిగిందని ఎస్సై తెలిపారు. ఎవరి నుంచి ఫిర్యాదులు లేవన్నారు. 

కర్రలేసుకొచ్చినా మౌనమేనా?: బోరుగడ్డ అనిల్‌ వర్గీయులు కర్రలతో తెదేపా కార్యకర్త ఇంటిపైకి దూసుకెళ్లినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. వైకాపా పెద్దలతో అనిల్‌కు పరిచయాలు ఉండడం వల్లే నడిరోడ్డుపై హంగామా చేసినా పోలీసులు మౌనం వహించారనే విమర్శలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని