బాధితులకు అండగా నిలిచిన మీడియాపై కేసులా?

వైకాపాకు ఓట్లేయలేదన్న కక్షతో విశాఖ కంచరపాలెంలోని ఓ కుటుంబంపై ఆ పార్టీ నేతలు చేసిన దాడి ఘటనను తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఎన్డీయే నేతలు మండిపడ్డారు.

Updated : 21 May 2024 06:20 IST

విశాఖ ఘటనలో పోలీసుల తీరు అప్రజాస్వామికం
కేసులు ఉపసంహరించుకునేలా ఈసీ ఆదేశాలివ్వాలి
ఎన్డీయే నేతల డిమాండ్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపాకు ఓట్లేయలేదన్న కక్షతో విశాఖ కంచరపాలెంలోని ఓ కుటుంబంపై ఆ పార్టీ నేతలు చేసిన దాడి ఘటనను తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఎన్డీయే నేతలు మండిపడ్డారు. దాడి చేసినవారిని వదిలేసి.. బాధితుల గోడును ప్రసారం చేసిన ‘ఈనాడు’, ఈటీవీ, ఆంధ్రజ్యోతితో పాటు గాయాలపాలైన వారితో విలేకరుల సమావేశం నిర్వహించిన ఎన్డీయే కూటమి అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుపై క్రిమినల్‌ కేసులు నమోదుచేయడం వారి ప్రాథమిక హక్కులను హరించడమేనని ధ్వజమెత్తారు. దీనిపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు లేఖ రాయగా, మిగతా కూటమి నేతలు ప్రకటనలు విడుదల చేశారు.


పత్రికా స్వేచ్ఛ హరిస్తున్నారు

- అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు 

‘‘వైకాపా నేతల దాడిలో మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే విషయాన్ని బాధితులు స్పష్టంగా చెప్పారు. దాడి చేసిన వైకాపా నాయకులను వదిలి.. బాధితుల పక్షాన మాట్లాడుతున్నవారిపై కేసులు నమోదుచేసిన పోలీసులు ఘటనను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పత్రికలపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు. జరిగిన విషయాన్ని ప్రసారం చేయడం తప్పెలా అవుతుంది? ప్రాథమిక హక్కులను కాలరాసేలా మీడియాపై నమోదుచేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకునేలా ఎన్నికల సంఘం ఆదేశాలివ్వాలి. వైకాపా నేతల సూచనల మేరకు నడుస్తూ.. విశాఖ పోలీసులు ఇప్పటికే అపఖ్యాతి పాలయ్యారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచడం, వారిపై అక్రమ కేసులు బనాయించడం, అధికార పార్టీ సిటింగ్‌ ఎంపీ కిడ్నాప్‌కు గురైనా.. మౌనంగా ఉండిపోయిన ఘనత విశాఖ పోలీసులకే దక్కుతోంది. హింసను అదుపు చేయడంలో విఫలమై.. పత్రికా స్వేచ్ఛను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి’’ అని సీఈఓకు రాసిన లేఖలో పేర్కొన్నారు.


జగన్‌పై స్వామిభక్తితోనే పత్రికలపై కేసులు 

- దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి 

‘‘ఓ సామాన్య కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చిన మీడియాపై కేసులు నమోదు చేసి పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. వారిపై పెట్టిన సెక్షన్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. జగన్‌పై స్వామిభక్తితో పోలీసులు చేసిన పనికి వారి ఖ్యాతి దేశాలు దాటుతోంది. విశాఖ డీసీపీ సత్తిబాబు అత్యుత్సాహంతో అడ్డగోలుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీనిపై సిట్‌ దృష్టిపెట్టాలి. ఎన్నికల కమిషన్‌ కూడా స్పందించాలి. డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా వివరణ ఇవ్వాలి. సీఎస్‌ జవహర్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రంలో నేటికీ డీజీపీ అధికారం నడుస్తున్నట్లు లేదు. తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న ధనుంజయ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలే అంతా నడిపిస్తున్నట్లు ఉంది. వైకాపా దాడులను కళ్లకు కట్టినట్లు చూపిన పత్రికలు, విలేకరుల సమావేశం నిర్వహించిన విష్ణుకుమార్‌రాజుపై కేసులు పెట్టి.. పత్రికా స్వేచ్ఛను కట్టడి చేయాలనుకోవడం దారుణం. వీటన్నింటినీ ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తాం. ఈ ఘటనపై విశాఖ సీపీ వివరణ ఇవ్వాలి.’’


 రాజకీయ ప్రేరేపితమని అర్థమవుతోంది

- నాదెండ్ల మనోహర్‌

‘‘బాధితురాలు సుంకర ధనలక్ష్మి కుటుంబం చెప్పిన విషయాలను ప్రసారం చేయడాన్ని నేరంగా పరిగణించడం అప్రజాస్వామికం. వైకాపా పాలనలో మీడియాకు రాజకీయ రంగులు పులిమి వర్గాలుగా విభజించారు. మీడియా నియంత్రణకు జీఓ నంబరు 1 తీసుకొచ్చారు. బాధితులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించిన విష్ణుకుమార్‌రాజుపై కేసు నమోదుచేయడం చూస్తే ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమని అర్థమవుతోంది. బాధితులపై దాడి చేసిన వారెవరో, ఎందుకు చేశారో పోలీసులు బయటపెట్టాలి. ఈ ఘటనపై ప్రత్యేకంగా విచారణ చేయించాలి.’’


 పోలీసులది ఆటవిక న్యాయం

- లంకా దినకర్, భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి 

‘ఓట్లేయలేదన్న అక్కసుతో మహిళలు, ఓ గర్భిణిపై వైకాపా నాయకులు తీవ్రంగా దాడిచేశారు. ఈ ఘటనలో నిందితులను వదిలి, బాధితులకు అండగా ఉన్నవారిపై కేసులు నమోదు చేయడం ఆటవిక న్యాయం. ఎన్డీయే అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు, మీడియా సంస్థలకు 41ఏ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు శాఖలో నేటికీ కొంతమంది జగన్‌ తొత్తులున్నారని అనిపిస్తోంది. పోలీసులు వైకాపా వాళ్ల దాడుల్ని దారి మళ్లించి, కుటుంబ కలహాలుగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారు. విశాఖ ఘటనతో పాటు.. తిరుపతిలో చంద్రగిరి ఎన్డీయే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి ఘటనల్లో సూత్రధారులను శిక్షించాలి.’’ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని