తెదేపా ముసుగులో విద్వేష ప్రసంగాలు చేస్తున్న కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి

సామాజిక మాధ్యమాల్లో తెదేపా కండువా ధరించి కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా వీడియోలు చేస్తున్న వైకాపా నాయకుడు మన్విత్‌ కృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.

Updated : 21 May 2024 07:33 IST

సీఐడీకి పార్టీ నేతల ఫిర్యాదు

డీఐజీ సెంథిల్‌కుమార్‌కు వినతిపత్రం అందిస్తున్న వర్ల రామయ్య,
మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మన్నవ సుబ్బారావు, చిట్టిబాబు, కోడూరి అఖిల్‌  

ఈనాడు డిజిటల్, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో తెదేపా కండువా ధరించి కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా వీడియోలు చేస్తున్న వైకాపా నాయకుడు మన్విత్‌ కృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తున్నవారిని గుర్తించాలని పార్టీ నేతలతో కలిసి కోరారు. అనంతరం వర్ల విలేకర్లతో మాట్లాడారు. ‘తాడేపల్లి ప్యాలెస్‌ సూచనలతోనే తెదేపా కండువా ధరించి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను దూషిస్తున్న కృష్ణారెడ్డిని కఠినంగా శిక్షించాలి. ఓడిపోతున్నామని తెలిసే వైకాపా నేతలు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నారు. ఐదేళ్లుగా ఇలాంటివారిని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేశారు. ఇక వైకాపా పని అయిపోయింది. లండన్‌ నుంచి జగన్‌ తిరిగొస్తారో రారోనని అనుమానం ఉంది. తప్పకుండా రావాలి. ప్రతిపక్షంలో కూర్చుని తెదేపా ప్రభుత్వ వైభవాన్ని చూడాలి’ అన్నారు. కార్యక్రమంలో తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టిబాబు, గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని