నాయకులను కొనుగోలు చేస్తున్న సీఎం

రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఓట్లు, నాయకులను కొనుగోలు చేస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలు అంశానికి అతీగతీ లేదని విమర్శించారు.

Published : 21 May 2024 05:48 IST

ఈటల రాజేందర్‌

హుజూర్‌నగర్‌లో మాట్లాడుతున్న ఈటల రాజేందర్, చిత్రంలో నల్గొండ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి తదితరులు

హుజూర్‌నగర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఓట్లు, నాయకులను కొనుగోలు చేస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలు అంశానికి అతీగతీ లేదని విమర్శించారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన భాజపా ముఖ్య నాయకుల సమావేశానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వైద్యం కుంటుపడిందని, కొనుగోళ్లు లేక ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతు రుణమాఫీ చేస్తానని లోక్‌సభ ఎన్నికల ముందు దేవుళ్ల మీద ప్రమాణాలు చేసుకునే దుస్థితికి రేవంత్‌రెడ్డి దిగజారారని విమర్శించారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను బెదిరించి, పట్టభద్రులను ప్రలోభపెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. భాజపా ప్రజల సమస్యలు తెలిసిన పార్టీ అని, ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి అన్ని వర్గాల వారి సమస్యలపై పోరాడిన వ్యక్తి అని అన్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో 12 నుంచి 13 సీట్లు గెలవబోతున్నట్లు చెప్పారు. సమావేశంలో నల్గొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల అసెంబ్లీ కోఆర్డినేటర్‌ వరుణ్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని