ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వకుండా.. 30 వేల నియామకాలు ఎలా చేపట్టారు?

అభయహస్తం అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజలపై భస్మాసుర హస్తం మోపుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ గెలుపొందాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వకుండా 30 వేల నియామకాలు ఎలా చేపట్టిందో చెప్పాలని ప్రశ్నించారు.

Updated : 21 May 2024 06:17 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కేటీఆర్‌ ప్రశ్న
ఎమ్మెల్సీగా ప్రశ్నించే గొంతుకను ఎన్నుకోవాలని పట్టభద్రులకు విన్నపం

ఖమ్మంలో మాట్లాడుతున్న కేటీఆర్‌. చిత్రంలో పల్లా, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, పువ్వాడ అజయ్, నామా, రాకేశ్‌రెడ్డి, తాతా మధుసూదన్‌

ఈటీవీ, ఖమ్మం: అభయహస్తం అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజలపై భస్మాసుర హస్తం మోపుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ గెలుపొందాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వకుండా 30 వేల నియామకాలు ఎలా చేపట్టిందో చెప్పాలని ప్రశ్నించారు. పోటీ పరీక్షలకు ఎలాంటి రుసుము ఉండబోదని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి.. ఇప్పుడు రెండింతలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా కొత్తగూడెం, ఇల్లెందు, ఖమ్మంలలో సోమవారం నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 56 కేసులున్న, 70 రోజులు జైలు జీవితం గడిపిన (పరోక్షంగా కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నను ప్రస్తావిస్తూ) వ్యక్తి కావాలో.. పట్టభద్రుల పక్షాన ప్రశ్నించే గొంతుక, భారాస అభ్యర్థి రాకేశ్‌రెడ్డి కావాలో విద్యావంతులు ఆలోచించాలని కోరారు. 

రాష్ట్రాన్ని అగ్రపథంలో నడిపాం

దేశంలోనే తెలంగాణను అగ్రపథాన నడిపించిన ఘనత గత భారాస ప్రభుత్వానికే దక్కుతుందని కేటీఆర్‌ అన్నారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, ప్రైవేటు రంగంలో 24 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని వివరించారు. 2014లో రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతుల విలువ రూ.57 వేల కోట్లు ఉంటే.. భారాస సర్కారు దిగిపోయే నాటికి రూ.2.41 లక్షల కోట్లకు చేరాయని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకురావడం లేదని, ఉన్నవాటిని నిలుపుకొనే సత్తా రేవంత్‌రెడ్డి సర్కారుకు లేదని మండిపడ్డారు. ఈ సమావేశాల్లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు