సీఎస్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులపై చర్యలా?

పోలింగ్‌ అనంతర హింసపై ఎన్నికల సంఘం దర్యాప్తు చేయించకుండా.. కేవలం సీఎస్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ అన్నారు.

Published : 21 May 2024 04:16 IST

లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌

ఈనాడు, అమరావతి: పోలింగ్‌ అనంతర హింసపై ఎన్నికల సంఘం దర్యాప్తు చేయించకుండా.. కేవలం సీఎస్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ అన్నారు. ‘పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి ప్రాంతాల్లో పరిస్థితులపై మీకు ముందే అవగాహన లేదా? గతంలో జరిగిన ఘటనలను పరిశీలించలేదా’ అని ఎన్నికల సంఘం, సీఎస్‌లను ఆయన ప్రశ్నించారు. ఇందులో ప్రధానంగా బలహీనవర్గాల అధికారుల్ని బదిలీ చేసి, బలిపశువుల్ని చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం ఆయన వెలగపూడి సచివాలయంలో సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనాను కలిసి వినతిపత్రం అందించారు. చర్యలు తీసుకున్న ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు తిరిగి పోస్టింగ్‌ ఇవ్వాలని కోరారు. ‘ఎన్నికల తర్వాత హింస జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ అధికారులపై చర్యలు తీసుకున్నారు. తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకు వారిని బలి చేశారు. ఇలాంటి చర్యలను సహించేది లేదు. పల్నాడు కలెక్టర్‌గా శివశంకర్‌ను తిరిగి కొనసాగించాలి’ అని విజయ్‌కుమార్‌ డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని