నిర్ణేతలు బీసీలే!

బలమైన రెండు కూటములు.. వర్గాలవారీగా విడిపోయిన ఓటర్ల మధ్య బిహార్‌లోని    8 నియోజకవర్గాలకు ఈ నెల 25వ తేదీన ఆరో విడతలో భాగంగా పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ జరిగే వాల్మీకి నగర్, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, శివ్‌హర్, వైశాలి, గోపాల్‌గంజ్, సివాన్, మహరాజ్‌గంజ్‌లలో మొత్తం 86 మంది బరిలో ఉన్నారు.

Published : 21 May 2024 05:04 IST

వర్గాల వారీగా విడిపోయిన బిహార్‌
కొత్త పొత్తులతో ఉత్కంఠ
6వ విడతలో 8 నియోజకవర్గాల్లో 25న పోలింగ్‌

బలమైన రెండు కూటములు.. వర్గాలవారీగా విడిపోయిన ఓటర్ల మధ్య బిహార్‌లోని    8 నియోజకవర్గాలకు ఈ నెల 25వ తేదీన ఆరో విడతలో భాగంగా పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ జరిగే వాల్మీకి నగర్, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, శివ్‌హర్, వైశాలి, గోపాల్‌గంజ్, సివాన్, మహరాజ్‌గంజ్‌లలో మొత్తం 86 మంది బరిలో ఉన్నారు. ఎన్డీయే కూటమిలో భాజపా, జేడీయూ, హిందుస్థానీ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్‌మోర్చా, లోక్‌ జన్‌ శక్తి ఉన్నాయి. ఇండియా కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ ఉన్నాయి.

  • ఎన్డీయేవైపు బ్రాహ్మణులు, రాజ్‌పూత్‌లు, కుర్మీ-కొయెరీ, దళితులు, మహా దళితులు ఉన్నారు. వీరంతా 35శాతం వరకూ ఉంటారు.
  • ఇండియా కూటమివైపు ముస్లింలు,  యాదవ్‌లు ఉన్నారు. వీరు 32 శాతం వరకూ ఉంటారు.
  • వీరు కాకుండా ఎన్నికల ఫలితాలను తేల్చాల్సింది ఈబీసీలు, ఎంబీసీలే. వీరిలో వందల సంఖ్యలో ఉప కులాలున్నాయి. వీరు 33శాతం ఉంటారు. దీంతో కింగ్‌ మేకర్‌ పాత్ర పోషించేది వీరే. 
  • కుల గణన, రిజర్వేషన్ల అంశం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముంది. మహిళల ఓట్లపైనా ఎన్డీయే ఆధారపడుతోంది. 

సరిహద్దు, సున్నితం..

నేపాల్‌ సరిహద్దులో ఉండటంతోపాటు నక్సల్స్‌ ప్రభావితం కావడంతో వాల్మీకినగర్‌ అత్యంత సున్నిత నియోజకవర్గంగా ఉంది. చంపారన్‌ జిల్లాలో ఇది ఉంది. బిహార్‌లో ఉన్న ఏకైక జాతీయ వన్యప్రాణుల పార్కు ఇక్కడే ఉంది. 

2014లో భాజపా, 2019లలో జేడీయూ ఇక్కడ గెలిచాయి. ఈ నియోజకవర్గంలో 12,75,653 మంది ఓటర్లున్నారు. ఈసారి ఆర్జేడీ నుంచి దీపక్‌ యాదవ్, జేడీయూ నుంచి సునీల్‌ కుమార్‌ బరిలో నిలిచారు. నీతీశ్, భాజపా మళ్లీ జట్టు కట్టడంతో ఎన్డీయే బలంగా కనిపిస్తోంది. ఇండియా కూటమి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న సీట్లలో వాల్మీకినగర్‌ ఉంది. 

సత్యాగ్రహ నేల

ఉత్తర బిహార్‌లో నేపాల్‌ సరిహద్దున ఉన్న పశ్చిమ చంపారన్‌లో భోజ్‌పురి మాట్లాడతారు. మహాత్మా గాంధీ తన తొలి సత్యాగ్రహాన్ని చంపారన్‌లోనే ప్రారంభించారు. రాజకీయ కార్యకలాపాలకు చాలాకాలంపాటు ఇది కేంద్ర స్థానంగా నిలిచింది. 2008లో ఇది నియోజకవర్గంగా మారింది. బస్మతీ బియ్యానికి ఇది ప్రసిద్ధి.

2009, 2014, 2019 ఎన్నికల్లో భాజపా నేత సంజయ్‌ జైశ్వాల్‌ ఇక్కడ విజయం సాధించింది. నాలుగోసారి ఆయనే బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ నుంచి మదన్‌ మోహన్‌ తివారీ పోటీ చేస్తున్నారు. భాజపాకు కంచుకోట కావడంతో జైశ్వాల్‌ విజయం నల్లేరుపై నడకేనని భావిస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంపై గట్టి పట్టుంది. 

అత్యంత వెనుకబాటు

బిహార్‌లో అతి చిన్న జిల్లా శివ్‌హర్‌. సామాజికంగా, ఆర్థికంగా అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉంది. ఈ ప్రాంతానికి వరదలొస్తే మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి. బజ్జీకా, హిందీ భాష మాట్లాడేవారుంటారు. సహకార ఉద్యమానికి పితామహుడైన జుగల్‌ కిశోర్‌ సిన్హా ఈ ప్రాంతానికి చెందినవారే. ఈ నియోజకవర్గంలో 12.69,056 మంది ఓటర్లున్నారు. 

2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఈసారి ఇద్దరు మహిళల మధ్య పోటీ సాగుతోంది. భాజపాకు గట్టి పట్టున్న ఈ సీటును నీతీశ్‌ పట్టుబట్టి మరీ తీసుకున్నారు. జేడీయూ తరఫున లవ్‌లీ ఆనంద్, ఆర్జేడీ తరఫున రీతు జైశ్వాల్‌ పోటీ చేస్తున్నారు. లవ్‌లీ ఆనంద్‌ భర్త ఆనంద్‌ మోహన్‌ సింగ్‌.. తెలుగువారైన ఐఏఎస్‌ అధికారి కృష్ణయ్య హత్య కేసులో నిందితుడు. దీంతో అతడికి 16ఏళ్ల జైలు శిక్ష పడింది. నీతీశ్‌ కుమార్‌ ప్రత్యేక చట్టంద్వారా అతడిని బయటకు తీసుకొచ్చారు. రీతు భర్త ఐఏఎస్‌ అధికారి. రీతు వైశ్య వర్గానికి చెందినవారు. ఈ నియోజకవర్గంలో నాలుగో వంతు మంది వైశ్యులున్నారు. భాజపా తన టికెట్‌ను త్యాగం చేయడం, జేడీయూ వైశ్యేతరులకు టికెట్‌ ఇవ్వడంపై స్థానిక వైశ్యులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఈసారి గట్టి పోటీ నెలకొంది.

విభిన్న తీర్పరి

జనకుడి రాజ్యమైన చంపారన్‌లోని భాగమే తూర్పు చంపారన్‌. గతంలో మోతీహారీగా ఉన్నప్పుడు కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్, జనతా పార్టీ గెలిచిన ఈ సీట్లో ఇప్పుడు భాజపా పాగా వేసింది. ఈ నియోజకవర్గంలో 11,87,264 ఓట్లున్నాయి. 

2009, 2014, 2019లలో భాజపా నేత రాధామోహన్‌ సింగ్‌ విజయం సాధించారు. నాలుగోసారి మళ్లీ రాధామోహన్‌ సింగ్‌ బరిలో నిలిచారు. ఇండియా కూటమిలోని వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ నుంచి రాజేశ్‌ కుమార్‌ పోటీ చేస్తున్నారు. భాజపా మోదీ గ్యారంటీలపై ఆధారపడుతుండగా.. యువత సమస్యలను ఇండియా కూటమి ప్రస్తావిస్తోంది. 

మహావీరుడి జన్మస్థలం

మిథిల ప్రాంతంలో ఉన్న వైశాలి.. జైన మహావీరుడి జన్మస్థలం. ప్రస్తుతం ఇక్కడ సామాజిక వర్గాల వారీగా జనం విడిపోయారు. ఇది ఆర్జేడీ నేత రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌ కంచుకోట. ఇక్కడ అభివృద్ధి కంటే కులాల అంశమే ఎన్నికలను ప్రభావితం చేస్తుంది.

2014, 209లలో మోదీ హవా కారణంగా ఎల్జేపీ ఇక్కడ విజయం సాధించింది. ఈసారి ఎల్జేపీ తరఫున సిటింగ్‌ ఎంపీ వీణాదేవి, ఆర్జేడీ తరఫున విజయ్‌ కుమార్‌ శుక్లా తలపడుతున్నారు. వీణాదేవి రాజ్‌పూత్‌కాగా., శుక్లా భూమిహార్‌ వర్గానికి చెందినవారు. అభివృద్ధి లేమిని శుక్లా ప్రస్తావిస్తున్నారు. ఆయనే ఈసారి గెలిచే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. నియోజకవర్గంలో ఆయనకు బాగా పలుకుబడి ఉందని అంటున్నారు.

నదీతీరం

గండక్‌ నదీతీరాన ఉన్న గోపాల్‌గంజ్‌లో భోజ్‌పురీ మాట్లాడతారు. చెరకు అధికంగా సాగు చేస్తారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో 93 శాతం గ్రామాల్లోనే ఉంటారు. ఎస్సీలకు కేటాయించిన ఈ నియోజకవర్గంలో జనాభా పరంగా బ్రాహ్మణులదే ఆధిపత్యం. అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఇది ఒకటి.

2014లో భాజపా, 2019లో జేడీయూ ఇక్కడ గెలిచాయి. ఈసారి జేడీయూ తరఫున సిటింగ్‌ ఎంపీ అలోక్‌ కుమార్‌ సుమన్, ఇండియా కూటమిలోని వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ తరఫున ప్రేమ్‌ నాథ్‌ చంచల్‌ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నోటాకు 51,660 ఓట్లు పడ్డాయి. ఇది దేశంలోనే అత్యధికం. భాజపా మద్దతుతో గెలుపుపై జేడీయూ నమ్మకంగా ఉంది. ఆర్జేడీ అండతో వికాస్‌శీల్‌ పార్టీ గట్టిగా పోరాడుతోంది.

కోసల రాజ్యం

గతంలో కోసల రాజ్యంలో సివాన్‌ భాగంగా ఉండేది. బనారస్‌ రాజ్యంలోనూ కొనసాగింది. 1857లో స్వాతంత్య్ర ఉద్యమంలో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించింది. బ్రజ్‌ కిశోర్‌ ప్రసాద్‌ పర్దా వ్యతిరేక ఉద్యమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. భారత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ జన్మ స్థలం సివాన్‌. ఒకప్పుడు జనసంఘ్‌కు ఇది కంచుకోట. కండబలం కలిగిన షాహాబుద్దీన్‌ ఇక్కడి నుంచి ఐదుసార్లు గెలిచారు. అప్పట్లో నక్సల్స్‌కు భయపడిన అన్ని వర్గాల ప్రజలు అతడికి మద్దతిచ్చారు. షాహబుద్దీన్‌కు జైలు శిక్ష పడ్డాక సివాన్‌లో రాజకీయాలు మారిపోయాయి. ఇక్కడ ముస్లింలు 3లక్షల మంది, అగ్రవర్ణాలవారు 4లక్షల మంది ఉన్నారు. 

2014లో ఇండిపెండెంట్‌ ఓంప్రకాశ్‌ యాదవ్, 2019లో జేడీయూ నాయకురాలు కవితా సింగ్‌ గెలిచారు. ఈసారి జేడీయూ నుంచి విజయలక్ష్మి, ఆర్జేడీ నుంచి అవధ్‌ బిహారీ చౌధరి పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ నుంచి బయటికొచ్చి హినా షాహబ్‌ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. ముస్లింలు, బ్రాహ్మణులు, రాజ్‌పూత్‌లలో వెనుకబడిన వారిపై ఆమె ఆశలు పెట్టుకున్నారు. విజయలక్ష్మికి రాజకీయ అనుభవం లేదు. ఆమె భర్త రమేశ్‌ కుశ్వాహా సీపీఐఎంఎల్‌ నుంచి జేడీయూలో చేరారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అవధ్‌ కూడా ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఆయనకు ఈ ప్రాంతంలో మంచి పేరుంది. దీంతో ముక్కోణ పోటీ నెలకొంది. 

రాజ్‌పూత్‌ల అడ్డా

రాజ్‌పూత్‌ల జనాభా అధికంగా ఉన్న మహరాజ్‌గంజ్‌లో ముస్లింలు, యాదవ్‌ల కలయిక ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఒకప్పుడు ఇది కాంగ్రెస్‌కు కంచుకోట. ఉత్తర్‌ ప్రదేశ్‌ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో ఆర్జేడీ కూడా గెలిచింది. ఆ తర్వాతి నుంచి భాజపా పట్టు సాధించింది. 

2014, 2019లలో భాజపా నేత జనార్దన్‌ సింగ్‌ సిగ్రీవాల్‌ గెలిచారు. ఈసారి భాజపా నుంచి మళ్లీ సిగ్రీవాల్, కాంగ్రెస్‌ నుంచి ఆకాశ్‌ కుమార్‌ సింగ్‌ పోటీ చేస్తున్నారు. రాజ్‌పూత్‌ల ఆధిపత్యం ఉండటంతో ఆ వర్గానికి చెందినవారికే పార్టీలు టికెట్లు ఇస్తాయి. సిగ్రీవాల్‌కు క్షేత్ర స్థాయిలో మంచి పట్టుంది. క్లీన్‌ ఇమేజ్‌తోపాటు ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరుంది. ఆకాశ్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌ కుమారుడు. దీంతోపాటు భూమిహార్‌ కార్డును ఇండియా కూటమి ప్రయోగిస్తోంది. 


ఎక్కడ ఎంత మంది?

వాల్మీకినగర్‌: 10
పశ్చిమ చంపారన్‌: 8
తూర్పు చంపారన్‌: 12
శివ్‌హర్‌: 12
వైశాలి: 15
గోపాల్‌గంజ్‌: 11
సివాన్‌: 13
మహరాజ్‌గంజ్‌: 5

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని