సంక్షిప్త వార్తలు(5)

ఆధునిక భారత నిర్మాణానికి అద్భుతమైన పునాదులు వేసిన గొప్ప దార్శనికుడు రాజీవ్‌గాంధీ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తీవ్రవాదుల రాక్షస చర్యలకు ఆయన బలైపోయిన విషాద ఘటన ఇప్పటికీ గుండెను కలచివేస్తూనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

Updated : 22 May 2024 04:56 IST

ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు వేసిన దార్శనికుడు రాజీవ్‌గాంధీ: షర్మిల 

ఈనాడు, అమరావతి: ఆధునిక భారత నిర్మాణానికి అద్భుతమైన పునాదులు వేసిన గొప్ప దార్శనికుడు రాజీవ్‌గాంధీ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తీవ్రవాదుల రాక్షస చర్యలకు ఆయన బలైపోయిన విషాద ఘటన ఇప్పటికీ గుండెను కలచివేస్తూనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం ‘ఎక్స్‌’ వేదికగా ఆమె నివాళి అర్పించారు. ‘దశాబ్దాలు గడుస్తున్నా.. మీరు నింపిన స్ఫూర్తి, చూసిన బాటలో సాగుతుండటం గర్వంగా ఉంది’ అని షర్మిల పేర్కొన్నారు.


ఆరోగ్యశ్రీ నిధులను అస్మదీయులకు తరలించారు : లంకా దినకర్‌ 

ఈనాడు, అమరావతి : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, ప్రజల ఆరోగ్యాన్ని నీరో జగన్‌ గాలికి వదిలేశారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ధ్వజమెత్తారు. ‘ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత సీఎం జగన్‌కు మాత్రమే దక్కుతుంది. ఆసుపత్రులకు చెల్లించాల్సిన రూ.1,500 కోట్ల బిల్లులను చెల్లించకుండా ఆ నిధులను సీఎం తన అస్మదీయులకు తరలించారు. ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయటం జగన్‌ పాలన వైఫల్యానికి నిదర్శనం. పేదల ఆరోగ్య సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆయుష్మాన్‌ భారత్‌ నిధులూ జగన్‌ ప్రభుత్వం పక్కకు మళ్లించింది’ అని మంగళవారం విడుదలచేసిన ప్రకటనలో మండిపడ్డారు. 


సిట్‌ నివేదికను బహిర్గత పర్చాలి: సీపీఎం

ఈనాడు, అమరావతి: పోలింగ్‌ తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తునకు నియమించిన సిట్‌ బృందం సమర్పించిన నివేదికను బహిర్గతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ‘‘పోలీసుల దర్యాప్తులో అనేక లోపాలున్నట్లు సిట్‌ నిర్ధారించిన నేపథ్యంలో ఆ నివేదికలోని అన్ని వివరాలనూ వెల్లడించడం మరింత అవసరం. అల్లర్లు, హింసకు సంబంధించిన కేసుల దర్యాప్తులోని లోపాలను సరి చేసేలా ఎఫ్‌ఐఆర్‌లో మరికొన్ని సెక్షన్లు చేర్చాలని సిట్‌ ప్రతిపాదించినట్లు వార్తలొచ్చాయి. సిట్‌ నివేదికను బహిర్గతపరిస్తే పారదర్శకత పెరిగి, ప్రజలకు విశ్వాసం కలిగే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నారు. 


శత్రువు పొగుడుతున్న నేతతో సర్కారా? 

శత్రువు (పాకిస్థాన్‌) పొగుడుతున్న నేత (రాహుల్‌గాంధీ)ను గౌరవించి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలా? వారు దేశాన్ని ఎటు తీసుకువెళ్దామని అనుకుంటున్నారు? పుల్వామా, ఉరీ ఘటనల వెనుక పాక్‌ ఉగ్రదాడుల ప్రమేయం ఉందని అంగీకరించిన ఆ నేత మన ప్రధాని మోదీని ఏనాడూ పొగడలేదు. రాహుల్‌గాంధీని మాత్రం ‘రాహుల్‌ ఆన్‌ ఫైర్‌’ అని పొగిడారు. భారత్‌లో రామరాజ్యం ఆవిర్భవించకుండా ఏ శక్తీ అడ్డుకోజాలదు. మా పార్టీలో ఎవరు తప్పుచేసినా జైలుకు పంపిస్తాం. భాజపా సీఎంలలో ఎవరినీ ఏ ఒక్కరూ వేలెత్తి చూపించలేరు.

ఝార్ఖండ్‌లోని బొకారోలో ఎన్నికల సభలోకేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 


2004 పరిస్థితి పునరావృతమవుతుంది

ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్‌ 4న ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ వస్తుంది. భారత్‌ వెలిగిపోతోందని ఊదరగొట్టిన 2004 నాటి పరిస్థితి పునరావృతమై అధికార పీఠం నుంచి భాజపా దిగిపోతుంది. మతపరమైన పిచ్‌ తయారీకి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నా మా జట్టు దానిపై ఆడేందుకు నిరాకరించింది. ఆయన వేసిన గూగ్లీలు, బౌన్సర్లను విజయవంతంగా తిప్పికొట్టాం. 2004లో ఫలితాలు వచ్చిన నాలుగురోజుల్లో మన్మోహన్‌సింగ్‌ ప్రధాని అవుతారని తేలింది. ఈసారి అది ఇంకా వేగంగానే తేలిపోతుంది. కాబోయే ప్రధాని ఎవరని ఇప్పటికే ప్రజలు అడుగుతున్నారు.

పీటీఐ ఇంటర్వ్యూలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని