ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత జగన్‌దే

ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత సీఎం జగన్‌దేనని తెదేపా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆసుపత్రులకు రూ.1,500 కోట్ల బకాయిలు చెల్లించకుండా అస్మదీయ కాంట్రాక్టర్లకు సమర్పించుకున్నారని పేర్కొన్నారు.

Published : 22 May 2024 04:57 IST

మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజం

ఈనాడు డిజిటల్, అమరావతి: ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత సీఎం జగన్‌దేనని తెదేపా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆసుపత్రులకు రూ.1,500 కోట్ల బకాయిలు చెల్లించకుండా అస్మదీయ కాంట్రాక్టర్లకు సమర్పించుకున్నారని పేర్కొన్నారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆరోగ్యశ్రీ బకాయిలపై ప్రభుత్వం స్పందించడం లేదు. ఒప్పందం ప్రకారం 15 రోజుల్లో చెల్లించాల్సిన బిల్లులు 15 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేశాయి. తెదేపా హయాంలో ఎన్టీఆర్‌ వైద్యసేవా పథకం కింద ఆసుపత్రి ఖర్చుల కోసం 45 శాతం రోగికి ఇచ్చేవాళ్లం. 35 శాతం ప్రోత్సాహం కింద వైద్యులకు అందించేవాళ్లం. నేడు అడ్మినిస్ట్రేషన్‌ ఆసుపత్రులు, మానిటరింగ్‌ ఆసుపత్రులు అంటూ అర్థం కాకుండా చేశారు. ఈ ఆసుపత్రి కమిటీల కీలక బాధ్యతలను కోడికత్తి వ్యవహారంలో చికిత్స అందించిన వైద్యుడికి అందించారు. ఆయన సిఫారసు చేసిన ఆసుపత్రులకు బిల్లులు చెల్లించి వాటిలోనూ కమీషన్లు తీసుకుని దోపిడీకి పాల్పడ్డారు. 104, 108 సేవలనూ నీరుగార్చారు. ఫ్యామిలీ డాక్టర్, సురక్ష పేర్లు పెట్టి సేవలు మరిచారు. కేంద్రం నుంచి ఒక్కో కుటుంబానికి వచ్చే రూ.5 లక్షలు ఏం చేశారో లెక్కల్లో కనిపించడం లేదు. ఈ వాస్తవాలను బయటపెడతాం. ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే చెల్లించాలి’ అని డిమాండు చేశారు. 

బుద్ధి లేకుండా వైకాపా నేతల మాటలు 

‘రాష్ట్రంలో రక్తపాతం సృష్టించిన పది రోజుల తర్వాత బయటకు వచ్చిన వైకాపా నేతలు జోగి రమేష్, అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల సమయంలో అరాచకాలకు కారకులైన నిందితులను సిట్‌ అధికారులు వెంటనే అరెస్టు చేయాలి’ అని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని