జవహర్‌రెడ్డి, రాజేంద్రనాథరెడ్డి కనుసన్నల్లోనే దాడులు

ఎన్నికల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హింసాత్మక సంఘటనలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, పూర్వ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, పూర్వ నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు కనుసన్నల్లోనే చోటుచేసుకున్నాయని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు.

Published : 22 May 2024 04:58 IST

సిట్‌ లోతుగా దర్యాప్తు చేసి కుట్రదారులను శిక్షించాలి
తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ డిమాండ్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నికల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హింసాత్మక సంఘటనలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, పూర్వ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, పూర్వ నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు కనుసన్నల్లోనే చోటుచేసుకున్నాయని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. సిట్‌ అధికారులు లోతుగా దర్యాప్తు చేసి అసలు కుట్రదారులను బయటపెట్టాలని ఆయన మంగళవారం డిమాండు చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘దాడుల్లో ఉన్నతాధికారుల సహకారం ఉంది. సీఎస్, మాజీ డీజీపీల కాల్‌డేటానూ పరిశీలించి అధికార పార్టీ వ్యూహాన్ని బహిర్గతం చేయాలి. ఎన్నికలకు ముందే రాష్ట్రవ్యాప్తంగా 100 హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. కనీసం కేసులూ నమోదు చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నింటిపై నామమాత్రపు కేసులు పెట్టారు. ఎన్నికల కమిషన్‌ ఈ అరాచకాలను గుర్తించి అధికారులను బదిలీ చేసింది. లేదంటే ఎన్నికలు సజావుగా జరిగేవి కావు. కొందరు అధికారులు అధికార పార్టీతో లాలూచీ పడటమే హింసకు కారణం. పంచాయతీ ఎన్నికల్లో చేసినట్లు దౌర్జన్యాలు చేయడానికి పథకం పన్నారు. దీన్ని ఆచరణలో పెట్టడానికి సీఎస్, మాజీ డీజీపీలను వాడుకున్నారు. మాచర్లలో దాడులు, తిరుపతిలో పులివర్తి నానిపై హత్యాయత్నంపై సిట్‌ పూర్తిస్థాయిలో విచారించి ప్రత్యక్షంగా పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దాడుల కారకులు, ప్రేరేపించిన వారెవరో గుర్తించి సిట్‌ దర్యాప్తు చేయాలి. బదిలీ చేసిన అధికారుల కాల్‌ రికార్డులను తనిఖీ చేయాలి. దాడుల సందర్భంగా ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించిన వారిని అధికారులు నిందితులుగా చేర్చడం దారుణం’ అని మండిపడ్డారు.

కేంద్ర బలగాలతో స్ట్రాంగ్‌రూంలకు భద్రత కల్పించాలి 

‘స్ట్రాంగ్‌రూంల వద్ద పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలి. పిన్నెల్లి సోదరులు పారిపోవడానికి సహకరించిందెవరు? దీని వెనుక ఉన్న అధికారులపైనా ఈసీ చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని