మార్పు తేవడం అంటే ఇదేనా..?

‘‘భారాస హయాంలో అనేక పరిశ్రమలు వచ్చాయి. వరంగల్‌లాంటి నగరాలకు ఐటీ సంస్థలను తీసుకొచ్చాం. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కొత్త పరిశ్రమలు తేవడం చేతకావడం లేదు. కనీసం ఉన్న వాటినైనా కాపాడుకునే తెలివిలేదు.

Published : 23 May 2024 06:12 IST

ఉన్న పరిశ్రమలను కాపాడే తెలివి కూడా లేకపాయె..
ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్‌ ధ్వజం

వరంగల్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్‌. చిత్రంలో భారాస పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి

ఈనాడు, వరంగల్, శివనగర్, నర్సంపేట, న్యూశాయంపేట, న్యూస్‌టుడే: ‘‘భారాస హయాంలో అనేక పరిశ్రమలు వచ్చాయి. వరంగల్‌లాంటి నగరాలకు ఐటీ సంస్థలను తీసుకొచ్చాం. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కొత్త పరిశ్రమలు తేవడం చేతకావడం లేదు. కనీసం ఉన్న వాటినైనా కాపాడుకునే తెలివిలేదు. వరంగల్‌ నుంచి టెక్‌మహీంద్రా వెళ్లిపోతోంది’’ అంటూ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం ఉమ్మడి వరంగల్‌లోని నర్సంపేట, వరంగల్‌ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో భారాస పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... ‘‘మార్పు తెస్తామని రేవంత్‌రెడ్డి ఐదు నెలల క్రితం గద్దెనెక్కారు. ఇప్పుడు వరంగల్‌ ఎంజీఎంలాంటి ఆసుపత్రుల్లోనూ ఐదారు గంటలు కరెంటు లేక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. మార్పు తేవడమంటే ఇదేనా? అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని, మెగా డీఎస్సీ వేస్తామని, రైతులకు రూ.2 లక్షల పంట రుణమాఫీ దస్త్రంపై తొలి సంతకం చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఆరు నెలలైనా ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండానే, పోటీ పరీక్షలు నిర్వహించకుండానే 30 వేల ఉద్యోగాలిచ్చామని గొప్పలు చెప్పుకొంటున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం భర్తీ ప్రక్రియ పూర్తిచేశాక... న్యాయ సంబంధ సమస్యలు తీరగానే నియామక పత్రాలిచ్చి వారే కొలువులిచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. పోటీ పరీక్షలకు ప్రవేశ రుసుం వసూలు చేయబోమని చెప్పిన రేవంత్‌రెడ్డి టెట్ పరీక్షకు రూ.2 వేలు రుసుం ఎందుకు పెట్టారు? ఎన్నికల్లో ఇచ్చిన హామీకి విరుద్ధంగా సన్న రకం వడ్లకే బోనస్‌ ఇస్తామంటున్నారు. భారాస హయాంలో వరంగల్‌లో చేపట్టిన 24 అంతస్తుల ఆసుపత్రి నిర్మాణాన్ని కాంగ్రెస్‌ వాళ్లు గుత్తేదారు సంస్థ ఎల్‌అండ్‌టీని బెదిరించి నిలిపి వేయించారు’’ అని ఆరోపించారు. అనంతరం భారాస నేత ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ... కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నపై 56 కేసులు ఉన్నాయని, ఆయన ఇంటర్నెట్‌ నుంచి అనుమతి లేకుండా మహిళల చిత్రాలు సేకరించి దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బిట్స్‌ పిలానీలో చదివిన భారాస అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని విన్నవించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ... తాను నెగ్గితే వచ్చే వేతనాన్ని నిరుద్యోగుల కోసమే ఉపయోగిస్తానని ప్రకటించారు. 

ధర్మారం రైల్వే గేటు సమీపంలో రోడ్డు పక్కన పడి ఉన్న అంజయ్యను పరిశీలిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌

మానవత్వం చాటుకున్న కేటీఆర్‌ 

గీసుకొండ, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి పంపించి మాజీ మంత్రి కేటీఆర్‌ మానవత్వం చాటుకున్నారు. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం ధర్మారం రైల్వే గేటు సమీపంలో... బుధవారం ఉదయం 9.30 గంటలకు స్థానికుడైన అంజయ్య (55) బైక్‌పై వెళ్తూ కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డారు. అదేమార్గంలో నర్సంపేటకు వెళ్తున్న కేటీఆర్‌... అంజయ్యను గమనించి తన కారును ఆపారు. కాన్వాయ్‌లోని ఒక వాహనంలో క్షతగాత్రుడిని వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని