బోనస్‌ విషయంలో బోగస్‌ మాటలు

వరికి బోనస్‌ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం బోగస్‌ మాటలు చెబుతోందని మాజీ మంత్రి, భారాస సీనియర్‌ నేత హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు.

Published : 23 May 2024 06:11 IST

రైతులను కాంగ్రెస్‌ మోసం చేసింది: హరీశ్‌రావు

చిన్నకోడూరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు

చిన్నకోడూరు, న్యూస్‌టుడే: వరికి బోనస్‌ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం బోగస్‌ మాటలు చెబుతోందని మాజీ మంత్రి, భారాస సీనియర్‌ నేత హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో  మాట్లాడారు. రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పి, ఓట్లు డబ్బాలో పడ్డాక సన్న వడ్లకే ఇస్తామని మోసం చేసిందన్నారు. సన్నాలకు రోగం ఎక్కువ.. దిగుబడి తక్కువ.. పంట కాలపరిమితి ఎక్కువ కావడంతో ఈ ప్రాంతంలో వాటిని పండించే పరిస్థితి లేదని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో యాసంగిలో 3,38,389 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తే అందులో 3,21,469 ఎకరాల్లో దొడ్డు రకం, 16,920 ఎకరాల్లో సన్నరకం వేసినట్లు తెలిపారు. దొడ్డు వడ్లు పండించే 95 శాతం మందికి ఎగ్గొట్టి సన్న రకం పండించే కేవలం ఐదు శాతం రైతులకు బోనస్‌ ఇస్తామనడం దగా చేయడమేనన్నారు.  ఇచ్చిన మాట ప్రకారం రైతుబంధు డబ్బులను ఎకరానికి రూ.7,500 జూన్‌లోనే జమ చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రులు హైదరాబాద్‌లో కూర్చొని తడిసిన వాటితోపాటు ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని విమర్శించారు. చిన్నకోడూరు కొనుగోలు కేంద్రంలో 20 నుంచి 25 రోజులపాటు కేంద్రంలో ధాన్యం ఉందని, తేమ పోయినా కొనుగోలు చేయటం లేదన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని