పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సన్నద్ధంగా ఉండాలి

ఈ నెల 27న జరగనున్న వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక  నిర్వహణకు అధికారులందరూ సర్వసన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్‌రాజ్‌ ఆదేశించారు.

Published : 23 May 2024 04:48 IST

సీఈవో వికాస్‌రాజ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: ఈ నెల 27న జరగనున్న వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక  నిర్వహణకు అధికారులందరూ సర్వసన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్‌రాజ్‌ ఆదేశించారు. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లోని కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. బ్యాలెట్‌ బాక్స్‌లు, బ్యాలెట్‌ పేపర్లు తదితరమైనవన్నీ సిద్ధంగా ఉన్నాయని జిల్లా అధికారులు వివరించారు. ‘‘రాష్ట్రంలో వేడిగాలుల పరిస్థితుల దృష్ట్యా అన్ని బూత్‌ల వద్ద తాగునీరు, టెంట్‌లు తదితర సౌకర్యాలను కల్పించాలి. బ్యాలెట్‌ పేపర్లు, ఇతర పోలింగ్‌ సామగ్రిని తరలించే క్రమంలో అకాల వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నందున.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు శాంతిభద్రతలను సమీక్షించాలి’’ అని సీఈవో వికాస్‌రాజ్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో శాంతిభద్రతల అదనపు డీజీ సంజయ్‌జైన్, అదనపు సీఈవో లోకేశ్‌ కుమార్, రాచకొండ కమిషనర్‌ తరుణ్‌జోషి, సంయుక్త సీఈవో సర్ఫరాజ్‌ అహ్మద్, డిప్యూటీ సీఈవో సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని