సీసీ కెమెరాల నీడలో భయంభయంగా..

ఎన్నికల సమయంలోనే కాదు... అంతకు ముందూ... మాచర్ల నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాష్టీకాలు అన్నీఇన్నీ కావు.

Published : 23 May 2024 05:06 IST

పల్నాడులోని పలు గ్రామాల్లో వైకాపా బాధితుల పరిస్థితి

మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడులో వైకాపా దాడులకు భయపడి తెదేపా వారు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు

ఈనాడు, అమరావతి-ఈనాడు డిజిటల్, నరసరావుపేట: ఎన్నికల సమయంలోనే కాదు... అంతకు ముందూ... మాచర్ల నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాష్టీకాలు అన్నీఇన్నీ కావు. పలు గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు సాగించిన దారుణకాండలో ప్రాణాలకు భద్రతలేక అమాయకులు చిగురుటాకుల్లా వణికిపోయారు. చాలామంది ఊళ్లొదిలి పారిపోయారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన తెదేపా సానుభూతిపరుడు తోట చంద్రయ్యను వైకాపా వారు 2022 జనవరిలో చంపారు. హత్య జరిగిన అనంతరం.. చంద్రయ్య కుమారుడు వీరాంజీ, ఇతరులపై అధికార పార్టీ నుంచే కాకుండా.. పోలీసుల నుంచీ వేధింపులు పెరిగాయి. దీంతో ఆ ఏడాది ఏప్రిల్‌లో బాధితులు ఊరొదిలి వెళ్లిపోయారు. గుంటూరు, హైదరాబాద్, శ్రీశైలం అడవుల్లో, ప్రకాశం జిల్లాలో తలదాచుకున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక గ్రామంలో తిరిగి అడుగుపెట్టారు. అయినప్పటికీ తమ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇళ్లలో కాకుండా ప్రత్యేక ప్రదేశంలో ఉంటున్నారు. తాము ఉండే చోటుకు నలువైపులా సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.

ముస్లిం కుటుంబాలపై దాడులు.. 

2019 ఎన్నికల సమయంలో ఓ చిన్న విషయమై గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లిలో ముస్లిం కుటుంబాలపై వైకాపా దాడులకు తెగబడింది. చేతులు, కాళ్లపై ఇష్టమొచ్చినట్లుగా ఇనుప రాడ్లతో బాదడంతో కొందరు నడవలేని స్థితికి చేరుకున్నారు. అంతటితో ఆగకుండా.. బాధితులపైనే అక్రమ కేసులు పెడుతుండటంతో.. 300 కుటుంబాలు ఊరు విడిచి వెళ్లిపోయాయి. ఇటీవల కొంత కాలం క్రితం ఆ కుటుంబాలన్నీ ఊరికి వచ్చాయి. వైకాపా నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో బాధితులు తమ వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల గ్రామంలో... పోలీసులు సోదాలు చేయగా వైకాపా వారి ఇళ్లల్లో పెట్రో బాంబులు, కత్తులు, గొడ్డళ్లు దొరికాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని