పిన్నెల్లి సోదరులను పట్టుకు తీరతాం

పోలింగుకు ముందు, ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు బాధ్యులైన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకుతీరతామని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా హామీ ఇచ్చారని తెదేపా నేతలు తెలిపారు.

Published : 23 May 2024 05:07 IST

తెదేపా నేతలకు స్పష్టం చేసిన డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా

పిన్నెల్లిని అరెస్టు చేయాలని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాకు వినతిపత్రం అందజేస్తున్న తెదేపా నేతలు వర్ల రామయ్య,
జూలకంటి బ్రహ్మారెడ్డి, దేవినేని ఉమా, రామకృష్ణ, మన్నవ సుబ్బారావు,అఖిల్‌ తదితరులు

ఈనాడు డిజిటల్, అమరావతి: పోలింగుకు ముందు, ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు బాధ్యులైన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకుతీరతామని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా హామీ ఇచ్చారని తెదేపా నేతలు తెలిపారు. పిన్నెల్లి సోదరుల కోసం అయిదారు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయని..ఈ కేసు తమకూ ప్రతిష్ఠాత్మకమేనని డీజీపీ చెప్పారన్నారు. రెంటచింతల మండలం, పాల్వాయి గేటు పోలింగ్‌ స్టేషన్‌లో ఈవీఎంలను పగలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, ఆయన అనుచరుల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తెదేపా ఏజెంట్‌ శేషగిరిరావును గుర్తుపట్టిన డీజీపీ..ఆయన గాయాన్ని పరిశీలించారని వారు వెల్లడించారు. ఈ దాడిలో నిందితులపై తేలికపాటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని తెలపగా... హత్యాయత్నం కేసు పెట్టాల్సిందిగా జిల్లా ఎస్పీని ఆదేశిస్తానని హామీ ఇచ్చారన్నారు. తాడిపత్రి, తిరుపతి సహా వివిధ ప్రాంతాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. మాచర్ల అల్లర్లపై తెదేపా నేతలు వర్ల రామయ్య, జూలకంటి బ్రహ్మారెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, మన్నవ సుబ్బారావు, ఏఎస్‌ రామకృష్ణ, శేషగిరిరావు బుధవారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసుల సహకారంతో పిన్నెల్లి సోదరులు తప్పించుకుపోయారని వారు ఆరోపించారు.

అంబులెన్స్‌లు రాకుండా చేశారు....

గాయపడ్డ తెదేపా కార్యకర్తలను ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లలేని దయనీయ స్థితి కల్పించారని మాచర్ల తెదేపా అభ్యర్థి బ్రహ్మారెడ్డి వాపోయారు. ‘ఆసుపత్రులకు వెళితే అక్కడికొచ్చి.. కొడతారేమోననే భయంతో ఆర్‌ఎంపీల వద్దే వైద్యం చేయించుకుంటున్నారు. ప్రాణాపాయ పరిస్థితి ఉంటే ప్రైవేటు ఆసుపత్రికి వెళుతున్నారు’ అని ఆయన తెలిపారు. ‘పథకం ప్రకారం మాచర్లలో దాడులు జరిగాయి. ఎన్నికలకు ముందు, నామినేషన్‌ వేసేప్పుడు పిన్నెల్లి బహిరంగంగా తెదేపా వారిని హెచ్చరించారు.తక్షణం ఆయన్ని అనర్హుడిగా ప్రకటించాలి. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి రానివ్వకుండా అడ్డుకోవాలి’ అని బ్రహ్మారెడ్డి కోరారు. 

నన్ను చంపేస్తామని బెదిరించారు: శేషగిరిరావు

‘అరేయ్‌ జాగ్రత్త.. నిన్ను చంపేస్తా’ అని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నన్ను బెదిరించారు. పెద్ద కర్రతో ఆయన అనుచరులు నాపై దాడి చేశారు’ అని శేషగిరిరావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని