పిన్నెల్లి నేరసామ్రాజ్యం మాచర్ల

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టిన దృశ్యాల్ని చూసి దేశం మొత్తం నివ్వెరపోయింది! ఆ ఎమ్మెల్యే ఎంత అరాచకశక్తో, దౌర్జన్యకారుడో దేశం మొత్తానికి ఇప్పుడు తెలిసింది.

Updated : 23 May 2024 06:54 IST

కనుసైగతో నియోజకవర్గాన్ని శాసించిన ఎమ్మెల్యే
ప్రతిపక్షాలను బతకనివ్వరు.. ప్రజల్ని వేధిస్తారు
ఆయన చెప్పినట్టల్లా ఆడుతూ ఐదేళ్లుగా అరాచకం సృష్టించిన పోలీసులు

ఈనాడు, అమరావతి: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టిన దృశ్యాల్ని చూసి దేశం మొత్తం నివ్వెరపోయింది! ఆ ఎమ్మెల్యే ఎంత అరాచకశక్తో, దౌర్జన్యకారుడో దేశం మొత్తానికి ఇప్పుడు తెలిసింది. గత ఐదేళ్లుగా మాచర్ల నియోజకవర్గాన్ని తన సొంత సామ్రాజ్యంలా, ఆటవికరాజ్యంలా, అరాచకాలకు అడ్డాగా మార్చేసి వనరులన్నీ దోచుకుంటూ, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులకు, హత్యాకాండకు తెగబడుతూ ఆయన సాగించిన దాష్టీకాలు అన్నీ ఇన్నీకాదు. ప్రభాస్‌ నటించిన సలార్‌ సినిమాలో ‘ఖాన్సార్‌’లా పిన్నెల్లి ప్రత్యేక నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. వైకాపా మూకల్ని తాలిబాన్ల మాదిరిగా తయారుచేసి.. నియోజకవర్గంలో ప్రతిపక్షం అన్నది లేకుండా నిర్మూలించాలన్నట్లుగా బరి తెగించారు. 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వ్యక్తి... రాజ్యాంగం, వ్యవస్థలంటే గౌరవం, నాగరిక సమాజంలో బతుకుతున్నామన్న ఎరుక లేకుండా ప్రవర్తించడం, కనీస సంస్కారం లేకుండా మహిళల్ని అసభ్య పదజాలంతో దుర్భాషలాడటం ఆయనలోని ఆటవిక ప్రవృత్తికి, అరాచక ప్రవర్తనకు అద్దంపడుతున్నాయి. ఆ మధ్య వచ్చిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో విలన్‌ రాజప్ప చెప్పిందే వేదం. అతని అరాచకాలకు అడ్డూ అదుపూ ఉండదు. ఎన్నికల్లో అతనిపై ఎవరూ పోటీ చేయకూడదు. పోలీసులు అతని అడుగులకు మడుగులొత్తుతుంటారు. సాధారణంగా వాస్తవ ప్రపంచంలో జరిగేదానికి కల్పన, అతిశయోక్తులు జోడించి సినిమాలు తీస్తుంటారు. కానీ పిన్నెల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న మాచర్ల నియోజకవర్గంలోని పరిస్థితులు చూస్తే ఆ సినిమా తీసినవాళ్లే అవాక్కవుతారు. ఎమ్మెల్యే, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఈ ఐదేళ్లలో చేసిన అరాచకాలు, అకృత్యాలు, దారుణాలు, దోపిడీ గురించి వింటే వారు హడలిపోతారు! ఎందుకంటే వంద రాజప్పలు కలిస్తే ఒక రామకృష్ణారెడ్డి! 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక పిన్నెల్లి సోదరులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. 

అది అన్నాతమ్ముళ్ల నేరసామ్రాజ్యం!

అక్కడ అన్ని పదవులు, కాంట్రాక్టులు పిన్నెల్లి సోదరులకు, వాళ్ల మనుషులకే దక్కాలి. అన్ని వ్యాపారాలూ వాళ్లే చేయాలి. ఐదేళ్లలో మాచర్ల నియోజకవర్గాన్ని వారు పీల్చిపిప్పి చేశారు. 

  • ఎమ్మెల్యే సోదరుడి కనుసన్నల్లో అక్రమ మద్యం వ్యాపారం మూడు సీసాలు, ఆరు గ్లాసులుగా వర్ధిల్లింది. ప్రతి గ్రామంలోనూ మూడు, నాలుగు బెల్ట్‌షాపులు నడుపుతున్నారు. ప్రభుత్వ దుకాణాలకు వచ్చిన మద్యాన్ని సొంత షాపులు, బార్లకు తరలిస్తున్నారు. ప్రతి సీసాపై రూ.60 నుంచి రూ.120 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తుందనుకుని కాన్వాయ్‌ కోసం ఆరు కొత్త వాహనాల్ని కొన్నారు. ఇన్నాళ్లూ వాటిలోనే తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తెచ్చి విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
  • బాపట్ల, ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల నియోజకవర్గం మీదుగా తెలంగాణకు వెళ్లే గ్రానైట్‌ లారీల నుంచి ఎమ్మెల్యే మనుషులు రూ.12 వేల చొప్పున కప్పం కట్టించుకుంటారు. ఎవరైనా మొండికేస్తే... లారీ ఆ నియోజకవర్గం దాటకముందే అధికారులతో దాడులు చేయించి రూ.లక్షల్లో జరిమానాలు విధించేలా వేయిస్తారు. 
  • మాచర్ల నియోజకవర్గంలో స్థిరాస్తి వెంచర్లు వేయాలన్నా, నిర్మాణాలు చేపట్టాలన్నా ఐదు శాతం వాటా సమర్పించుకోవాలి. అపార్ట్‌మెంట్‌ కట్టేవాళ్లు రూ.20-30 లక్షలు సమర్పించుకుంటేనే అనుమతులు వస్తాయని చెబుతారు. 
  • ఎమ్మెల్యే, ఆయన సోదరుడు, అనుచరులంటే పోలీసులకు హడల్‌. ప్రతి స్టేషన్‌లోనూ ఎమ్మెల్యే మనుసులు ఇద్దరో, ముగ్గురో హోంగార్డులుగా పనిచేస్తుంటారు. స్టేషన్‌లో ఏం జరిగినా క్షణాల్లో ఎమ్మెల్యేకి చేరవేసేస్తారు. ఆ హోంగార్డులను చూసి సీఐ, ఎస్సైలు కూడా భయపడుతుంటారు. 
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా తరఫున నామినేషన్‌ వేద్దామనుకున్న కొందరు అభ్యర్థులకు పోలీసులే ఫోన్లుచేసి, పోటీ ఆలోచన మానుకోకపోతే గంజాయి వ్యాపారం చేస్తున్నావని కేసులుపెడతామని బెదిరించారు. 
  • ఒక మండలంలో పోలీసు అధికారి.. వైకాపా వాళ్లపై  తెదేపా వాళ్లెవరైనా స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేస్తే తీసుకోరు. పైగా వాళ్లు వైకాపాలో చేరే వరకు వేధించేవారు. మండలంలో పార్టీ మారినవారిలో 85 శాతం మంది ఆయన బాధితులే. 
  • గుండ్లపాడులో తెదేపా నేత చంద్రయ్య హత్య తర్వాత కిరాయి హంతకులతో వైకాపా నాయకుల్ని హత్య చేయించేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభియోగం మోపి, చంద్రయ్య బంధువుల్నే అరెస్ట్‌ చేసిన ఘనులు అక్కడి పోలీసులు. 
  • దుర్గి మండలం జంగమహేశ్వరపురంలో జల్లయ్య హత్య తర్వాత గ్రామంలో పోలీస్‌ పికెట్‌ కొనసాగుతుండగానే తెదేపా నేతలపై దాడులు జరిగాయి. 

సామాన్యుల తిరుగుబాటు!

పోలీసులు ఎమ్మెల్యేకు తొత్తుల్లా పనిచేస్తుంటే.. అధికార యంత్రాంగం ఆయన అడుగులకు మడుగులొత్తుతుంటే... ఇన్నాళ్లూ ఆయన అరాచకాల్ని మౌనంగా భరించిన సామాన్య ప్రజలే ఈ ఎన్నికల్లో తిరగబడ్డారు. సామాన్య మహిళలు ఎమ్మెల్యేను నిలదీయడమే కాకుండా, ఎదిరించి, వెంబడించి తరిమేయడం అక్కడి ప్రజల్లో వచ్చిన మార్పునకు నిదర్శనం. ఎమ్మెల్యే సోదరులు ఐదేళ్లుగా చేసిన అరాచకాల్ని ఇక భరించలేని పరిస్థితి ఏర్పడటం వల్లే ప్రజల్లో ఈ తెగువ వచ్చింది. అక్కడ బతికిబట్ట కట్టాలంటే ఈ ఎన్నికల్లో పిన్నెల్లిని ఓడించాలన్న కసి ప్రజల్లో కనిపించింది. నియోజకవర్గాన్ని ఇన్నాళ్లూ కనుసైగతో శాసించిన పిన్నెల్లి సోదరులు ప్రజల్లో వచ్చిన మార్పును జీర్ణించుకోలేక.. విచక్షణ కోల్పోయి ఎక్కడికక్కడ దాడులకు తెగబడ్డారు. ఓటమి తప్పదన్న నిస్పృహతోనే ఎమ్మెల్యే ఈవీఎంని పగలగొట్టారన్న అభిప్రాయం వినిపిస్తోంది.


వెబ్‌ కెమెరా పట్టిస్తే తప్ప.. పాపం పండలేదు!

ముఖ్యమంత్రి జగన్, ఇతర ప్రభుత్వ పెద్దల అండతో వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని పిన్నెల్లి సోదరులు ఐదేళ్లుగా రెచ్చిపోయారు. అక్రమ వ్యాపారాలు, భూదందాలు, గనుల అక్రమ తవ్వకాలు, అవినీతితో పేట్రేగిపోయారు. జనాల్ని భయపెట్టి, బెదిరించి ఆస్తులు లాక్కున్నారు. విపక్ష నాయకుల్ని నిర్మూలించడమే లక్ష్యంగా తీవ్రస్థాయిలో హింసాకాండకు పాల్పడ్డారు. ఆ ఎమ్మెల్యే ‘ప్రతిభ’ను మెచ్చి ముఖ్యమంత్రి ఆయనకు కేబినెట్‌ హోదా కలిగిన విప్‌ పదవిని కూడా కట్టబెట్టారు. పోలీసులు ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆయన జోలికి వెళ్లలేదు. జిల్లా ఎస్పీ మొదలు హోంగార్డు వరకు పోలీసు వ్యవస్థ మొత్తం ఆయనకు పాదాక్రాంతమైంది. చివరకు ఎమ్మెల్యే అరాచకాన్ని పోలింగ్‌ బూత్‌లో అమర్చిన వెబ్‌ కెమెరా పట్టివ్వడంతో.. ఈసీ ఆదేశాలతో విధిలేక ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేశారు. కానీ పిన్నెల్లి సోదరులు అప్పటికే పరారై.. పొరుగు రాష్ట్రంలో టీవీ ఛానళ్లకు బహిరంగంగా ఇంటర్వ్యూలిస్తున్నా పోలీసులు అరెస్ట్‌ చేయకుండా తాత్సారం చేశారు.


పట్టపగలే దాడులు... హత్యలు!

పిన్నెల్లి సోదరుల నేతృత్వంలో వైకాపా మూకలు గత ఐదేళ్లలో మాచర్లలో చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. 2019లో వైకాపా అధికారం చేపట్టగానే ఆ పార్టీ ముఠాలు తెదేపా మద్దతుదారుల్ని గ్రామాల నుంచి తరిమికొట్టాయి. తెదేపాకు గట్టి పట్టున్న గ్రామాల్లో ఆ పార్టీవారిని గ్రామ బహిష్కరణ చేసి, కట్టుబట్టలతో తరిమేశారు. జంగమేశ్వరపాడులో 2020లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయులు దాడి చేయడంతో 60 కుటుంబాలు ఊరు విడిచి వెళ్లిపోయాయి. గుండ్లపాడు నుంచి కొన్ని కుటుంబాలు వెళ్లిపోయాయి. అలాంటి గ్రామాలు మాచర్ల నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. బంధుమిత్రులు చనిపోతే చూడటానికి కూడా సొంతూరికి రాకుండా వారంతా ప్రాణభయంతో బతికారు. 

  • వైకాపా మూకలు పట్టపగలే హత్యలకు తెగబడ్డాయి. 2022 జనవరిలో వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెదేపా నాయకుడు తోట చంద్రయ్యను వైకాపా నాయకులు పట్టపగలే నడిరోడ్డుపై పీక కోసి చంపేశారు. జూన్‌లో దుర్గి మండలం జంగమేశ్వరపాడులో తెదేపా నాయకుడు జల్లయ్యను గ్రామ వైకాపా నాయకుడు హత్య చేశాడు. 
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్ల మున్సిపాలిటీతో పాటు, దుర్గి, కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి, మాచర్ల మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచి పదవులన్నీ వైకాపా అభ్యర్థులకే ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్యే అనుచరులు ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని బెదిరించి, ఎవరూ నామినేషన్లు వేయకుండా బీభత్సం సృష్టించి ఎన్నికల్ని ఏకగ్రీవం చేసుకున్నారు. 
  • మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా తెదేపా శ్రేణులకు అండగా నిలిచేందుకు మాచర్ల వెళ్లిన తెదేపా నాయకులు బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నల కారుపై నడివీధిలో ఎమ్మెల్యే అనుచరుడు, స్థానిక వైకాపా నాయకుడు కిశోర్‌ సెంట్రింగ్‌ కర్రతో దాడి చేయడం, వారి కారులో ఉన్న న్యాయవాదిని తీవ్రంగా గాయపరచడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆశీస్సులతో కిశోర్‌ ఏకంగా మాచర్ల మున్సిపాలిటీకి ఛైర్మన్‌ అయిపోయారు. 20 నెలల పాటు ఆ పదవిలో ఉన్న కిశోర్‌ దాన్ని అడ్డుపెట్టుకుని అనేక భూకబ్జాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు.
  • 2022 డిసెంబరు 16న మాచర్లలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం తలపెట్టిన తెదేపా నాయకులు, కార్యకర్తలపై ఎమ్మెల్యే అనుచరులు విరుచుకుపడి, బీభత్సం సృష్టించారు. మాచర్లను రణరంగంగా మార్చేశారు. బ్రహ్మారెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయం, తెదేపా నాయకుల ఇళ్లకు నిప్పు పెట్టారు. అంత జరిగినా అప్పటి ఎస్పీ రవిశంకర్‌రెడ్డి దాన్ని తెదేపా నాయకుల తప్పుగానే చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని